మంగళగిరి
రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు బుధవారం ముట్టడించారు. టీడీపీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కమిషన్ కార్యాలయం వద్ద నిరసన జరిపారు. మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ఫిర్యాదు చేసారు. ఈ నిరసనలో విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులు కుడా పాల్గోన్నారు. బుధవారం నాడు విచారణకు రావాలని చంద్రబాబు, బోండా ఉమకు కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్ కు లేదని టీడీపీ వాదన. విచారణకు హాజరుకావడం లేదని బోండా ఉమ తెలిపారు. తెలుగు మహిళల ముట్టడితో మహిళా కమిషన్ కార్యాలయం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపధ్యంలో అక్కడ భారీ గా పోలీసులు మోహరించారు.
టీడీపీ సంఘీభావ ర్యాలీ
మహిళలను చైతన్యపరిచేలా నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బుధవారం సంఘీభావ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ కేంద్రంలో తెలుగు మహిళా సంఘాలు, తెదేపా శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. దేవినేని మాట్లాడుతూ అన్నవస్తాడు.. ఉద్ధరిస్తాడు.. అని ఆశపడిన అక్కచెల్లెమ్మల బతుకులు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. మూడేళ్ల పాలనలో సుమారు వెయ్యికి పైగా మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగాయంటే మహిళా భద్రత పై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలతో పాటు మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్న అంశాలపై మహిళలను చైతన్య పరిచేలా సంఘీభావ ర్యాలీ నిర్వహించామని అన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మహిళలపై జరుగుతున్న దాడులు, నేరాల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. సగటున రోజుకు మూడు అత్యాచారాలు జరుగుతున్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో వెల్లడించిందని అయన గుర్తు చేసారు.