హైదరాబాద్, ఏప్రిల్ 27,
టీఆర్‌ఎస్ 21వ ప్లీనరీ వేడుకలు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల హెచ్‌ఐసీసీలో అంగరంగగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ జెండావిష్కరణను సీఎం కేసీఆర్ గావించారు. అయితే అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 2 దశాబ్దాల క్రితం పరిస్థితులు అగమ్యగోచరంగా ఉంన్నాయన్నారు. ఏడుపొచ్చి ఏడుద్దామన్నా.. ఎవ్వరినీ పట్టుకొని ఏడువాలో తెలియని తెలంగాణ ప్రజల గుండె చప్పుడు నుంచి ఉద్భవించిన పార్టీయే టీఆర్‌ఎస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు ప్రారంభమైన టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు 60 లక్షల సభ్యత్వాలతో, వెయ్యికోట్ల ఆస్తులతో ఉందన్నారు.అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి, రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చుదిద్దుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఆయన కొనియాడారు. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కంచుకోటని, ఈ టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఈ 2 దశాబ్దాలలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, విజయాలు, అపజయాలు ఎదుర్కొందని ఆయన అన్నారు.నిబద్ధమైన, సువ్యవస్థీతమై కొలువుదీరిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ(TRS) అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. 80 శాతం మంది పరిపాలన భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో 60 లక్షల మంది సభ్యులతో, సుమారు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి, సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షతంగా తీర్చిదిద్దుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట. ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఒక వ్యక్తిదో, శక్తిదో కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను, ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ సీఎం పేర్కొన్నారు.రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవర్నీ పట్టుకొని ఎడ్వాలో తెలువని పరిస్థితి అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అస్థిత్వమే ఆగమయైపోయే పరిస్థితి. ఒక దిక్కుతోచని సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగిసిపడింది. అపజయాలు, అవమనాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచింది అని కేసీఆర్ తెలిపారు
అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు
కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరిస్తున్న ఫలితాలు, అవార్డులు, రివార్డులే మన పనితీరుకు మచ్చుతునక అని కేసీఆర్ పేర్కొన్నారు. నిన్న విడుదల చేసిన ప్రకటనలో దేశంలో అతి ఉత్తతమైనటువంటి పది గ్రామాలు తెలంగాణవే నిలిచాయి. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా ప్రకటించింది. మన పనితీరుకు ఇది మచ్చుతునక అని చెప్పారు. కేంద్రం నుంచి అవార్డు రానటువంటి డిపార్ట్‌మెంట్ తెలంగాణలో లేదన్నారు. ఒక నిబద్ధమైన పద్ధతిలో, అవినీతిరహితంగా, చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నాం. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇవాళ జలభాండగారంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ చానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి, సీతారామ పూర్తి చేసుకుంటే తెలంగాణలో కరువు ఉండనే ఉండదని స్పష్టం చేశారు.విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకున్న వేళలో వెలుగు జిలుగుల తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇది మన అంకిత భావానికి మంచి ఉదాహరణ. ఏ రంగంలో అయినా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాం. ఎందరో మహానుభావులు, గొప్పవాళ్లు, పార్టీకి అంకితమై పని చేసే నాయకుల సమాహారమే ఈ ఫలితాలకు కారణం అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలే ఇతివృత్తంగా పని చేస్తున్నాం. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశానికే దిశ దశ చూపిస్తున్నాం హరీష్ రావు :
రాష్ట్రవ్యాప్తంగా గులాబీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హెచ్‌ఐసీసీలో 4500 మందికి సరిపోయేవిధంగా ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందన్నారు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికే దశ దిశ చూపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు ఆకలి చావులు, ఆత్మహత్యలతో ప్రశ్నార్థకంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు సుమారు 12 రాష్ట్రాలు వలస వచ్చి పనిచేసుకునేంత ఎత్తుకు ఎదిగిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెబుతున్న డబుల్ ఇంజన్ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస కూలీలు వస్తున్నారన్నారు.
ఇక జాతీయ రాజకీయాలు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో తెలంగాణ రాష్ట్ర సమితి కలిసి పనిచేస్తే తప్పేంటని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ప్రశాంత్ కిషోర్‌ను టీఆర్ఎస్ వాడుకుంటోందంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొచ్చారు. ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో కాంగ్రెస్, బీజేపీలతో కలిసి పనిచేశారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేయడంపై మాట్లాడే అర్హత బీజేపీ, టీఆర్ఎస్‌లకు లేదన్నారుటీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తప్పనిసరిగా భవిష్యత్‌లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తంచేశారు. దీని కోసం టీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు.బీజేపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న పాదయాత్రను ప్రజలు ఆదరించడం లేదని మంత్రి హరీష్ అన్నారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి ఆదరణ లేకపోవడంతో దీన్ని ఎలా ఆపాలని బండి సంజయ్ ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ సభల్లో కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయని హరీశ్ రావు విమర్శించారు.
దేశ సౌభాగ్యం కోసం గులాబీ ప్రణాళికలు :
దేశంలో జరుగుతున్న దారుణాలపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించడం శుభసూచకమని ఎంపీ కే కేశవ రావు అన్నారు. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ తరహా అభివృద్ధి నమూనా అమలు చేయాలంటే కేసీఆర్ లాంటి సమర్థ నేత మరో పోరాటానికి పూనుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఎంపీ కేకే స్వాగతోపన్యాసం చేశారు. అసమర్ధ కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న పోరాటంలో టీఆర్‌ఎస్ క్రియాశీల పాత్ర పోషించే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా తెలంగాణ సమాజం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘తెలంగాణ ఇంటి పార్టీ, ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి నేటితో 21 ఏండ్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. దేశంలో అనేక పార్టీలు ఎంత వేగంగా పుట్టాయో అంతే వేగంగా కాలగర్భంలో కలిసి పోయాయి. తెలంగాణ సాధన కోసం కూడా ఎన్నో పార్టీ లు వచ్చినా లక్ష్యాన్ని చేరుకోకుండానే మాయమయ్యాయి. అయితే కేసీఆర్ పట్టుదల, మొండి తనం, నిజాయితీ, చిత్తశుద్ధి టీఆర్ఎస్ ను నిలిచి గెలిచేలా చేశాయి. కేసీఆర్ అసాధారణ ప్రతిభా పాటవాలు, అకుంఠిత దీక్షాదక్షతలతో పార్టీని ప్రబలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు. అనేక అనుమానాలు, అవమానాల మధ్య కఠోరమైన లక్ష్యాన్ని సాధించారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కేసీఆర్ తనకంటూ ఓ బ్లూ ప్రింట్ తయారు చేసుకుని దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నందువల్లే ఇంత తక్కువ వ్యవధిలో మనం అద్భుత విజయాలు సాధిస్తున్నాం.నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ టాగ్‌లైన్ సాకారమయ్యే దశకు తెలంగాణ చేరుకున్నందుకు సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతమైన ప్రగతి ఒక్కటి చాలు కేసీఆర్ సమర్ధ పాలకుడని చెప్పడానికి. తెలంగాణ అంధకారమవుతుందని విమర్శించిన వాళ్ల నోళ్లు ఇపుడు మూతపడ్డాయి. కరెంటు వెలుగులతో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా మారిందిదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు సైతం కరెంటు కోతలతో సతమతవుతుంటే తెలంగాణ మాత్రం అన్ని రంగాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ త్వరలోనే 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్ధ్యానికి చేరుకుని చరిత్ర సృష్టించ బోతోంది. గతంలో కాగితాలు, శిలాఫలకాలకే పరిమితమైన సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ చేసిన భగీరథ ప్రయత్నం వల్ల ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయి. సాగు తాగునీళ్లకు కటకటలాడిన తెలంగాణ ఇపుడు జల భాండాగారంగా మారింది.వలసలు లేని ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలకు చోటు లేని తెలంగాణ అని గర్వంగా చేప్పుకునే స్థాయికి చేరుకున్నాం. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌తో వ్యవసాయ రూపు రేఖలే మారిపోయాయి. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరికం క్రమంగా తగ్గు ముఖం పడుతున్నది. అభివృద్ధికి కొలమానాలుగా భావించే ప్రతి అంశంలోనూ దేశ సగటు కన్నా తెలంగాణ ఎక్కువగానే ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం, డీఎస్‌డీపీ ఎనిమిదేండ్లలోనే రెట్టింపు కావడం ఆర్థిక రంగం ఎంత బలంగా ఉందో చాటిచెబుతున్నది. ఉద్యోగాల కల్పన విషయంలో చూసినా, మౌలిక సదుపాయాల ఏర్పాటులో చూసినా దేశానికి తలమానికంగా మారింది.అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా చూసుకుని కేసీఆర్ పాలన సాగించబట్టే రాష్ట్రంలో ఇంతటి మార్పు సాధ్యమైంది. తెలంగాణ అభివృద్ధి కళ్ల ముందున్నా, సామాన్యుడికి కూడా ఇది అర్థమైనా.. రోజూ విమర్శలు చేయడమే పనిగాపెట్టుకున్న వారు కారణం లేకుండానే దుష్ప్రచారాలకు దిగడం బాధాకరం. ప్రతిపక్షాల అబద్ధాలు.. పనిచేసే కేసీఆర్ ప్రభుత్వం ముందు నిలవవు. నరనరానా తెలంగాణ మేలునే నింపుకున్న కేసీఆర్ ఆశయం ముందు ప్రత్యర్హుల నక్కజిత్తులు పని చేయవు.రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష ధోరణి తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నాయి. కనీసం రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం రకరకాల ఆంక్షలు పెట్టిన తీరు దుర్మార్గం. ఏ విషయంలోనూ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం సహకరించకుండా తెలంగాణ ప్రగతి వేగాన్ని తగ్గిస్తున్నది. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న నేతలను రకరకాలుగా వేధిస్తున్నారు. దేశంలో అన్ని వ్యవస్థలను నీరుగార్చే ప్రయత్నం సాగుతోంది. నిజాలు మాట్లాడే వారి గొంతుల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ దాని అనుబంధ సంస్ధలు మతపరమైన అంశాలు తెరపైకి తెస్తూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాయి.రానున్న రోజుల్లో కూడా టీఆర్ఎస్‌ను అజేయంగా ఉంచేందుకు కేసీఆర్ దగ్గర నిర్ధిష్ట ప్రణాళిక ఉంది. తెలంగాణను బాగు చేసుకున్నట్టే దేశాన్ని బాగుచేసే పనిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ఎంపీ కేకే అన్నారు.