విజయనగరం, ఏప్రిల్ 28,
మత్తెక్కించే చాట్ లు,,రెచ్చగొట్టే మగువల ఫోటోలు.. కాస్త ముగ్గులోకి దిగితే చాలు అంతే జేబుగుల్ల కావడం ఖాయం. ఇన్నాళ్ల పాటు పట్టణ ప్రాంతాలకు పరిమితం అయిన యవ్వారం ఇప్పుడు ఏకంగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి పాకింది. సోషల్ మీడియా వేదికగా వలపు వలేసి…వయ్యారి భామల ఫోటోలతో పైసా వసూల్ చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీలో పెరుగుతున్న సైబర్ ఆగడాలు యువతను చిత్తుచేస్తున్నాయి.సోషల్ మీడియా వేదికగా సైబర్ పంజా విసురుతున్నారు కేటుగాళ్లు. వాట్సాప్ లో మెస్సెజ్ లు పెట్టి ముగ్గులోకి లాగేశారు. అలా రాత్రి అయితే చాలు యూత్ ను అట్రాక్ట్ చేయడం కోసం మెస్సెజ్ లు వచ్చేస్తాయి. న్యూడ్ కాల్ కావాలంటే ఒక రేట్,బాడీలోని పార్ట్స్ చూపించాలంటే సెకన్ కింత అంటూ ఓమెస్సెజ్ పెట్టేస్తారు. మెస్మరైజ్ చేస్తూ పే చాట్ అంటూ కబుర్లు చెప్పేశారు. కాకా పట్టి ముగ్గులోకి లాగి ముందుగా 10,20 రూపాయలతో మొదలైన చాటింగ్ తర్వాత నెమ్మదిగా చిన్నచిన్న నగ్నదేహ వీడియోలు చూపించేస్తారు. అలా చూస్తున్న క్రమంలో స్క్రీన్ రికార్డ్ చేసేస్తారు..తర్వాత బ్లాక్ మెయిల్ చేసి లక్షలు డిమాండ్ చేస్తున్నారు. న్యూడ్ వీడియో కాల్ డెమో కోసం 30రూపాయలు చెల్లించాలి. తర్వాత వీడియో కాల్ చేస్తే పది నిమిషాలకు 110 రూపాయలు.. ఇలా 15,20 అరగంట నిమిషాలు పెరుగుతున్న కొద్దీ డబ్బులు పెంచేస్తారు. గంట వీడియో కాల్ చేస్తే 500 రూపాయలు అంటూ ఛార్జీల లిస్ట్ పంపించేస్తారు. ఇదేకాకుండా సెక్సీ మాటలకు సైతం పది నిమిషాలకు 50రూపాయలు చెల్లించాలి. దానికి స్కానర్ పంపిస్తారు..గూగుల్ పే,ఫోన్ పే,పేటిఎం ద్వారా వసూల్ చేస్తున్నారు.ఇవన్నీ అయ్యాక సదరు యువకుడిని వీలైతే న్యూడ్ కాల్ చేయమని అదంతా స్క్రీన్ రికార్డ్ చేసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తారు. లేదంటే నీ ఫ్రెండ్ లిస్ట్ లోని నంబర్లకు పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇలాంటి విషయలన బాధితులు ఎవ్వరు చెప్పడానికి ముందుకు రావడంలేదు. చాలా మంది మోసపోయామని ఇంతటితో ఆపేద్దామని కాళ్లా వేళ్లా పడుతున్నారు. మరికొంతమంది ఎందుకొచ్చిన గోల అంటూ ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుంటున్నారు. ఇలాంటివాటి పట్ల అప్రమత్తంగా లేకుంటే జేబులు గుల్ల కావడం ఖాయం అంటున్నారు నిపుణులు.డబ్బులు అడగడంకోసం కొత్త కొత్త ట్రిక్స్ ఫాలో అవుతున్నారని యువకులైనా ఎవ్వరైనా ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. డబ్బుల కోసం ఎవరైనా డీపీలతో చాట్ చేస్తే అనుమానం రాగానే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా కలెక్టర్ లు గతంలో పోలీసులు,ఇతర అధికారుల పేర్లమీద డబ్బులడిగిన యవ్వారాలు బయటపడ్డాయి. ఇక తాజాగా హనీ ట్రాప్ వల వేస్తున్నారు. ట్రాప్ లో పడకుండా ఎవ్వరికి వారు జాగ్రత్తపడాలంటున్నారు సైబర్ నిపుణులు.