YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ప్రణాళికాబద్ధంగా పబ్లిక్ పరీక్షల నిర్వహణ... రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రణాళికాబద్ధంగా పబ్లిక్ పరీక్షల నిర్వహణ...   రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జగిత్యాల
జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ ,పదవ  తరగతి మరియు టెట్ పరీక్షల నిర్వహణ పై గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఇంటర్మీడియట్ అధికారులతో విద్యా శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావం తో గత రెండు సంవత్సరాలుగా పబ్లిక్ పరీక్షలు  నిర్వహించలేదని, ప్రస్తుత సంవత్సరం విద్యార్థుల సన్నద్ధం కోసం అవసరమైన సమయం అందించి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. మే 6,2022 నుంచి మే 24, 2022 వరకు ఇంటర్ పరీక్షలు, మే 23 ,2022 నుంచి జూన్ 1, 2022 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు.  వేసవికాలంలో పరీక్షల నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేక బస్సులు నడపాలని, విద్యార్థులను క్షేమంగా వారి ఇంటి వద్ద దీనిపై ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. పరీక్షల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నిర్వహణపై కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 2 సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అధికంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మానసిక వైద్యుల తో కౌన్సిలింగ్ అందించే ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాల్ గుర్తించి వారికి  టోల్ ఫ్రీ నెంబర్ 18005999333 ద్వారా కౌన్సిలింగ్ అందించే  విధంగా ఆదేశాలు జారీ చేయాలని విద్యాశాఖ, ఇంటర్మీడియట్ అధికారులకు మంత్రి సూచించారు. వేసవి నేపథ్యంలో మన ఇంటి పిల్లలు పరీక్షలు రాసేందుకు వెళ్ళిన సమయంలో తీసుకునే జాగ్రత్తలు అన్ని తీసుకోవాలని, విద్యార్థులకు ఎలాంటి  అసౌకర్యం కలగదని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సి సి టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,  పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవద్దని,  చీఫ్ సూపరిండెంట్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు సమక్షంలో ప్రశ్నపత్రాల కవర్ సీళ్లు ఓపెన్ చేయాలని, ఆ సమయంలో అధికారులు సెల్ఫోన్ తీసుకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నేపద్యంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు త్రాగునీరు అందుబాటులో ఉండాలని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కనీస మందులతో ఏఎన్ఎం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షలు జరుగుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 17852 మంది విద్యార్థులకు 30 కేంద్రాలు, 10వ తరగతి పరీక్షలకు 11818 మంది విద్యార్థులకు 67 కేంద్రాలు ఏర్పాటు చేశామని,  పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థుల రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ బిఎస్ లత , ఎస్పీ సింధు శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నారాయణ, జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్, జిల్లా కోశాధికారి, విద్యుత్ అధికారులు, పంచాయతీ అధికారి , మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts