విజయనగరం, ఏప్రిల్ 27
నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు జాత్యాంహకారంతో సీఐడీ చీఫ్, అడిషనల్ డీజీపీ పీవీ సునీల్ కుమార్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అంబేద్కర్స్ ఇండియా మిషన్(ఏఐఎం) విజయనగరం జిల్లా కమిటీ ధ్వజమెత్తింది. సునీల్ కుమార్ పై రఘు రామ కేంద్రానికి చేసిన ఫిర్యాదుల్లోని అంశాలు అవాస్తవమని ఏఐఎం జోనల్ ఇంచార్జ్ ఎం అప్పారావు ఖండించారు. గురువారం స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగిన ప్రెస్ మీట్ లో జిల్లా కన్వీనర్ కెల్ల భీమారావు, బీవీ రమణ, లోపింటి లక్ష్మణ్ తదితరులతో కలిసి మాట్లాడారు. తన విధి నిర్వహణలో భాగంగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, రఘు రామ కృష్ణం రాజును కేసుల విచారణ నిమిత్తం అరెస్ట్ చేశారన్నారు. నాటి నుంచి ఆయనపై కక్ష గట్టిన ఎంపీ, సునీల్ కుమార్ ను బద్నాం చేయడానికి అనేక కుయుక్తులు పన్నుతున్నారని సుస్పష్టంగా తెలుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ ఉన్నతాధికారిగా జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డులు పొందుకున్న సునీల్ కుమార్ పై కృష్ణం రాజు రాజకీయ బురద జల్లే ప్రయత్నం పనిగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. అంబేద్కర్స్ ఇండియా మిషన్ దళితుల చైతన్యం కోసం ఏర్పాటైన సంస్థ అని, ఎయిమ్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు ఎన్నడూ, ఎక్కడా పాల్పడలేదని తెలిపారు. ఏఐఎం ఒక స్వచ్ఛంద వేదిక. దీనికి ఎటువంటి చందాలు, విరాళాలు వంటి నిధులు సేకరణ లేదన్నారు. ఉన్నత విద్యా వంతుడిగా పీవీ సునీల్ కుమార్ తన సామాజిక వర్గానికి చెందిన దళితుల అభ్యున్నతికి, వారిలో చైతన్య స్ఫూర్తికి ఈ సంస్థ ద్వారా తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు తప్పితే, ఎటువంటి ఆర్ధిక పరమైన కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఆయనకు లేదన్నారు. ఎవరైనా తమ సొంత ఖర్చులతో చేసుకునే అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, నిర్వహించే సభా కార్యక్రమాలకు వారి ఆహ్వానం మేరకు హాజరయ్యే సునీల్ కుమార్ ఎక్కడా, ఎప్పుడూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవని గుర్తు చేస్తున్నామన్నారు. కుల, మత వైషమ్యాలు లేకుండా అందరితో కలిసి దళితులు సంఘ జీవులుగా జీవించాలని, అట్రాసిటీ చట్టంను దుర్వినియోగం చేయవద్దని, అట్రాసిటీ చట్టం లేని సమాజాన్ని మనం చూడాలనే విధంగా సునీల్ కుమార్ ప్రసంగాలు ఉంటాయని ఉద్ఘాటించారు . ఆయనొక బాధ్యత గల రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారని, రఘు రామ కృష్ణం రాజు మల్లే బ్యాంకులను మోసం చేసి, వేల కోట్ల రూపాయలు దోచుకు తిన్న బాపతు కాదని ఎద్దేవా చేశారు. ఎక్కడో ఢిల్లీలో దొంగలా దాక్కునే రఘు రామ కి ఏం తెలుసు, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ గురించని ప్రశ్నించారు. సీఐడీ ఏదో, దిశ ఏదో, దేనికి ఎవరు అధికారో తెలియని రఘు రామ ఒక అవివేకని విమర్శించారు. సునీల్ వ్యక్తి గత జీవితంపై విమర్శలు చేసే రఘు రామ ఒక కుసంస్కారని ధ్వజమెత్తారు. రఘు రామ కుప్పిగంతులకి, దుష్ప్రచారానికి వణికిపోయేటంత బలహీనలు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కాదని, ఆయన ధైర్యం ఆయన నిజాయితీలో ఉందని, ఆయన బలం వృత్తి పట్ల ఆయనకున్న అంకిత భావంలో ఉందని గర్వంగా చెప్పారు. రఘు రామ లాంటి వారు ఎన్ని ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేసినా ఆయన చలించరని. చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం ఆయన రక్తంలో ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకి ఆయన బద్ధుడని. ఆయన అభిమానులు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారన్నారు. తన స్వజనుల అభ్యున్నతికి పాటుపడే ఆయన్ని ఎవరైనా ఒక్క మాట అన్నా, ఎయిమ్ సభ్యులుగా మేం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ రఘు రామ కి అక్కడి దళిత జనం తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, అదే పార్టీపై రాజకీయంగా బురద జల్లే హీనమైన వ్యక్తిత్వం రఘు రామదని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక, ప్రభుత్వ అధికారిని ఆ రొంపులోకి లాగుతున్న రఘు రామ నీచ సంస్కృతికి ప్రభుత్వమే తగిన సమాధానం ఇస్తుందని ఆశీస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ నాయకులు ఎస్ అప్పారావు, డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.