విజయవాడ, ఏప్రిల్ 29,
మామూలుగా శివుడాజ్ణ లేనిదే చీమైనా కుట్టదంటారు. కానీ వైసీపీలో మాత్రం జగనాజ్ణ లేకుండా ఇక్కడి పుల్ల కూడా అక్కడికి ఎవరూ కదపలేరు. అంతా జగన్ ఇష్ట ప్రకారమే...అన్నీ జగన్ కనుసన్నల్లోనే అన్నట్లుగా ఉంటుంది వైసీపీలో పరిస్థితి. అయితే ఫలితం విషయంలో మాత్రం జగన్ సత్ఫలితాలను మాత్రమే తన ఖాతాలో వేసుకుంటారు. వైఫల్యాలను మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రుల ఖాతాలో ఆటోమేటిగ్గా పడిపోలాయి. ఇటీవల సర్వేల ఫలితాలంటూ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. సర్వేలలో తనకు మంచి గ్రేడ్ వచ్చిందని చెప్పుకున్న జగన్ ఎమ్మెల్యేలెవరికీ పాస్ మార్కులు కూడా రాలేదని చెప్పారు. జాగ్రత్తగా ఉండాలనీ, ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని దాదాపు హెచ్చరికలు జారీ చేసినంత పని చేశారు. అంతా బానే ఉంది.. మూడేళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలు మెచ్చే విధంగా పని చేయలేకపోయారు.. అయితే జట్లు మొత్తం ఫెయిలైతే.. జట్టు నాయకుడొక్కరే ఎలా పాస్ అయ్యారు? జట్టు ఓడిపోయి.. నాయకుడు మాత్రమే గెలిచిన విచిత్రం ఎక్కడైనా ఉంటుందా? కానీ జగన్ మాత్రం వైసీపీలో ఉందంటున్నారు. తానొక్కడినే గెలిచి.. మిగిలిన ఎమ్మెల్యేలంతా ఓడిపోయారని చెబుతున్నారు. అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేయగలిగేదేముంది? రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలోనూ ఒకటే నీతి.. ఒకటే రీతి. ఏ నియోజకవర్గంలోనైనా సరే.. చీమ చిటుక్కు మనాలన్నా జగన్ అనుమతి తప్పని సరి అన్న పరిస్థితి ఉంటుంది. వైసీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలలో అయితే పరిస్థితి మరీ ఘోరం. ప్రభుత్వ పరంగా ఈ మూడేళ్లలో జరిగిన పనులు శూన్యం. ఎమ్మెల్యేలు బిల్లులు వస్తాయి కదా అని తమ సొంత పలుకుబడితో చేయించిన పనుల బిల్లులే కోట్లాది రూపాయలు పేరుకుపోయి ఉన్నాయి. ఆ బిల్లులు రాకపోవడంతో స్థానికంగా వారి పలుకుబడీ పలుచబడిపోయింది. ఇప్పుడు మూడేళ్ల తరువాత ఆ బిల్లులకు మోక్షం ఎప్పుడో తెలియని స్థితిలో ఎమ్మెల్యేలుంటూ... మీకు సాప్ మార్కులు రాలేదు, జాగ్రత్తగా ఉండకపోతే, ప్రజా మద్దతు పొందక పోతే టికెట్లు ఉండవు అంటు హెచ్చరించడంతో వారి పరిస్థితి మింగలేకా..కక్కలేకా అన్నట్లుగా తయారైంది. నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా జరిగే ఏ కార్యక్రమంతో ఎమ్మెల్యేలకు సంబంధం ఉండదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వారి ప్రమేయం ఉండదు. అంతా జగన్ మయం...జగన్ బొమ్మ పెట్టుకుని హడావుడి చేసేది వాలంటీర్లు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా..నిధులు, విధులు లేకుండా..అధికారాలన్నీ అధినేత వద్ద కేంద్రీకృతం చేసుకుని ఎమ్మెల్యేలపై జనంలో అసంతృప్తి అంటూ హెచ్చరికలు జారీ చేస్తుండటం పట్ల ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి వ్యక్త మౌతున్నది. తమకు ఏమైనా పనులు కావాలన్నా వాలంటీర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.