ఒంగోలు, ఏప్రిల్ 29,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ రెడ్డి సర్కార్ మళ్లీ షాక్ ఇచ్చింది. గత సంవత్సరానికి సంబంధించిన కరువుభత్యం బిల్లులను అప్ లోడ్ చేసు అవకాశం లేకుండా సీఎఫ్ఎంఎస్ లో లాగిన్ ను మూసేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 వేల కోట్ల రూపాయల డీఏ బిల్లులు చెల్లింపులు లేక నిలిచిపోయాయి. తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై దెబ్బకొట్టిన ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరత కారణంగా డీఏ బిల్లులను ఇప్పటికే ఏపీ సర్కార్ వెనక్కి పంపేయడం చర్చనీయాంశంగా మారింది.ఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో అధికార పీఠం ఎక్కిన జగన్ రెడ్డి సర్కార్ అవకతవకలు, చేతగానితనం, అనాలోచిత చర్యలు ఒక్కొక్కటిగా వెల్లడవుతూనే ఉన్నాయి. పరిపాలనలో ప్రభుత్వ పెద్దల అనుభవ రాహిత్యం కారణంగా రాష్ట్ర ఖజానాను పూర్తి దివాలా దిశగా నడిపిస్తున్నారు. ఆదాయం వస్తున్నా.. చెల్లింపుల విషయంలో ఏమాత్రం చేవలేక, చేతకాక చేతులెత్తేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. నవరత్నాల పేరు చెప్పి ఖజానాలోని సొమ్మంతా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చుపెట్టేసి, ఆనక అత్యవసర సమయాల్లో, అభివృద్ధి పనుల విషయంలో వైసీపీ సర్కార్ మొండిచెయ్యి చూపిస్తోందని అంటున్నారు.ఖజానాను ఖాళీ చేసేసి, దొరికిన చోటల్లా అప్పులు తెచ్చేసి, ఆపైన ఓవర్ డ్రాఫ్ట్ కూడా వాడేసినా రోజువారీ పాలన సాగించలేని దుస్థితిలోకి ఏపీని నెట్టేసిన జగన్ సర్కార్ ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖల నుంచీ నిధులు తలరించుకుపోయింది. నిజానికి ఏపీకి ఇక అప్పు కూడా పుట్టని దుస్థితి దాపురించింది. అవీ చాలకపోవడంతో పంచాయతీరాజ్ వ్యవస్థలోని అట్టడు స్థాయిలోని పంచాయతీల నుంచి కూడా సొమ్ములు లాగేసుకుంది. తద్వారా గ్రామాల్లో పనులు కొనసాగించలేక సర్పంచ్ ల చేత చిప్పలు చేతపట్టించింది రాష్ట్ర సర్కార్. అయినా దాని కరువు తీరకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల డీఏ బకాయిల్ని కూడా చెల్లించకుండా మొండికేసే స్థితికి దిగజారిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.తాజాగా.. డిస్ట్రిక్ట్ డ్రాయింగ్ ఆఫీసర్ల (డీడీఓల) నుంచి డీఏ బిల్లులు మార్చినెల చివరి వారంలో సబ్ ట్రెజరీలకు వచ్చాయట. వేతనాలు, పింఛన్లు తప్ప మరే బిల్లునూ అప్ లోడ్ చేసేందుకు సీఎఫ్ఎంఎస్ ఛాన్స్ ఇవ్వడం లేదని సబ్ ట్రెజరీ ఉద్యోగుల నుంచి వస్తున్న సమాచారం. జిల్లా సబ్ ట్రెజరీ ఆఫీసులు వాటిని అప్ లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే మంగళవారం సాయంత్ర నుంచే అవి అప్ లోడ్ కావడంలేదట. ‘ఇన్ సఫిసియంట్ ఆఫ్ ఫండ్స్’ అనే ఆప్షన్ సబ్ ట్రెజరీ ఆఫీసుల కంప్యూటర్ తెరలపై కనిపిస్తోందట. దీంతో ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఏడాది క్రితం డీఏ బిల్లులు చెల్లించకుండా జగన్ రెడ్డి సర్కార్ తమకు తీవ్ర అన్యాయం చేస్తోందని దుయ్యబడుతున్నారు.గత ఏడాది డీఏ ఒక్కొక్కరికి సుమారు 6 వేలు నుంచి లక్ష రూపాయల వరకు రావాల్సి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే సంవత్సరం దాటిపోయినా తమ డీఏ బిల్లుల్ని ఇంకా ఎంతకాలం ప్రభుత్వం ఆపుతుందని ఫైరవుతున్నారు.