హైదరాబాద్, ఏప్రిల్ 29,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ల మధ్య, ఇద్దరూ తెలుగు ర్రాష్టాల ముఖ్యమంత్రులు అనేది తప్ప ఇంకేదైనా సారుప్యత వుందా? అంటే నిన్నమొన్నటి వరకు అలాంటి సారుప్యతలు అంతగా కనిపించేవి కాకపోవచ్చును. కానీ, యాదృచ్చకమో ఏమో కానీ, ఒకే రోజున ఇద్దరు ముఖ్యమంత్రులు, తమ మనసులోని మాటను ఖుల్లం ఖుల్లా బయట పెట్ట్టారు. ఇద్దరికిద్దరూ రాజకీయాలు అంటే, డబ్బు, అదొక వ్యాపారం, ఇంత పెట్టుబడి పెట్టాలి, ఇంత రాబట్టాలి అనే ధోరణిలోనే మాట్లాడారు. ఈ విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకే విదంగా నడుస్తున్నాయనే విషయాన్ని ఆ ఇద్దరే స్వయంగా బయట పెట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించిన రోజునే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్ల్యేలు, పార్టీ సమన్వయ కర్తల సమావేశంలో తమ మనసులోని మాటను బయట పెట్టారు. రాజకీయం అంటే డబ్బు. డబ్బే రాజకీయం అని, ఇంతవరకు ఏ రాజకీయా నాయకుడు బహిరంగంగా బయటకు చెప్పని విధంగా తెలుగు ముఖ్యమంత్రులు స్పష్టంగా దేశానికి చాటింపు వేసి మరీ చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్, కారణాలు ఏవైనా జాతీయ రాజకీయాలపై చాలా కాలంగా చాలా చాలా మాటలు మాట్లాడారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయ కూటమి ఏర్పాటు చేస్తామన్నారు. అందుకోసం కొంత ప్రయత్నం చేశారు. అక్కడిక్కడికి వెళ్లి, వాళ్ళను వీళ్ళనూ కలిసి వచ్చారు. అయినా, ఫలితం లేక పోయిందో ఏమో, ఇప్పుడు ట్రాక్ మార్చారు, ఫ్రంట్లు, టెంట్లు కాదు, ప్రత్యాన్మాయ విధానాలు కావాలని ఉద్ఘోషించారు. అంతవరకూ బాగుంది. అయితే, అదే సమయంలో అందుకు కొనసాగింపుగా, ఆయన జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు తమకు ఆర్థిక స్థోమత పుష్కలంగా ఉందని, ఒకటికి రెండు సార్లు, కాదు, పదే పదే చెప్పు కొచ్చారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలంటే ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కావాలో లెక్కలు చెప్పారు. పార్టీ బ్యాంక్ ఖాతాల్లో అంతకంటే ఎక్కువే సొమ్ములున్నాయని చెప్పు కొచ్చారు. అంటే డబ్బులుంటే చాలు, జాతీయ స్థాయిలో చక్రం తిప్పవచ్చని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని అంటున్నారు. అయితే ఇక్కడ, ఇంకో తిరకాసు కూడా ఉందని అంటున్నారు. కేసీఆర్ తమకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేందుకు అక్కడకు, ఇక్కడకు వెళ్లి వాళ్ళను వీళ్ళను కలిశారు. అయిన గుర్తింపు రాలేదు. ఢిల్లీలో ఓ పీఆర్వోను పెట్టుకున్నారు. కానీ, అదీ అంతగా వర్క్ అవుట్ అయినట్లు లేదు. అందుకే ఉత్తరాది రాష్ట్రాల్లో చిన్నాచితక పార్టీలు, నాయకులను అయినా ఆకర్షించేందుకు, కేసీఆర్ డబ్బుల లెక్కలు అంత బిగ్గరగా చెప్పారని, తెరాస సీనియర్ నాయకుడు ఒకరు అనుమానం వ్యక్తపరిచారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విషయానికి వస్తే, ఆయన కేసీఆర్ కంటున్న పీఎం కుర్చీ కలలు కనడం లేదు కానీ, రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం ఎంత ఈజీనో లెక్కల్లో చూపించారు. “అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో, ఎన్ని బటన్లు నొక్కాం, రూ. 1.37 లక్షల కోట్లు ఓటర్ల ఖాతాల్లో వేశాం. ఈ ఏడాది మరో రూ.55 వేల కోట్లు, వచ్చే సంవత్సరం మరో రూ.55 వేల కోట్లు ఓటర్ల ఖాతాల్లో వేస్తాం. అంటే మొత్తంగా రూ.2.50 లక్షల కోట్లు ఓటర్ల ఖాతాల్లో వేస్తున్నాం. ఇంత గొప్పగా చేసిన తర్వాత కూడా గతంలో వచ్చిన 151 సీట్లకు తగ్గ కూడదు. అసలు 151 మాత్రమే ఎందుకు, మొత్తానికి మొత్తంగా 175 సీట్లు మనకే ఎందుకు రాకూడదు” అంటూ జగన్ రెడ్డి చేసిన ఎన్నికల వ్యాఖ్యానం, విస్మయం కలిగించింది. నిజమే కావచ్చును, ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రభావం భయంకరంగా పెరిగిన మాట వాస్తవం. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎన్ని వేల కోట్లు ఖర్చయ్యాయో ఏమో కానీ, ‘అత్యంత ధనిక ఎన్నిక’ గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అయితే, ఇలా ఎముకలు మెడలో వేసుకోవడం దేనికి సంకేతం? ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం కాదా? అన్నదే ప్రశ్న.