విజయవాడ, ఏప్రిల్ 30,
ఆంధ్రప్రదేశ్’ లో ఒకేసారి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర శాసన సభలో ఉన్నసంఖ్యాబలం కారణంగా ఈ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదలా ఉంటే,ఈ నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఒక సీటు, బిజినెస్ కోటాలో, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీకి రిజర్వు అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ విషయాన్ని కూడా ఢిల్లీ పెద్దలతో చర్చింఛి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఇదే బిజినెస్ కోటాలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి సన్నిహితుడు, రిలయన్స్ సంస్థల వైస్‌ప్రెసిడెంట్ పరిమళ్ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పడు అదే విధంగా మరో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీని రాజ్య సభకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. అదలా ఉంటే, వైసీపీపీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం జూన్ మొదటివారంలో ముగుస్తోంది.ఆయనకు రెండోసారి కూడా అవకాశమిచ్చేందుకు జగన్ రెడ్డి సుముఖంగా లేరని సమాచారం. అయితే, మాయల పకీరు ప్రాణం చెట్టు తొర్రలో ఉన్నట్లు, జగన్ రెడ్డి గుట్టుమట్లన్నీ విజయసాయి గుప్పిట్లో ఉన్నాయని, అందువలన చేత పార్టీ పునర్వ్యవస్తీకరణలో ప్రయోగించిన, ‘బ్లాక్ మెయిల్’ అస్త్రాన్ని విజయ సాయి మళ్ళీ ప్రయోగిస్తే ముఖ్యమంత్రి ఏమి చేస్తారనేది అనుమానమే అంటున్నారు. విజయసాయి వ్యవహారం ఎలా ఉన్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరిని, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరినీ పెద్దల సభకు పంపాలనే నిర్ణయానికి వచ్చారని, పార్టీ వర్గాల సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి బీర మస్తాన్ రావు, డొక్కా మాణిక్య వర ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలొ ఒకరికి రాజ్య సభ టికెట్ ఖాయమని అంటున్నారు. అలాగే, ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో కమ్మ సామాజిక వర్గానికి మొండి చేయి చూపించి, విమర్శలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి, చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్’కు రాజ్యసభ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని,అంటున్నారు. నిజానికి జగన్ రెడ్డి తెలుగు దేశం పార్టీనుంచి వచ్చిన విడదల రజనీని చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించిన సమయంలోనే, రాజశేఖర్’ కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ప్రామిస్ చేశారు. అయితే, ఆతర్వాత అలవాటులో పొరపాటుగా, మాట తప్పారు. మడమ తిప్పారు. ఇప్పుడు, రాజకీయ అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చి, కమ్మ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచే అలోచన చేస్తున్నారని అంటున్నారు.
మరోవంక వైసీపీలో సహజంగానే, పైసా ఖర్చు లేకుద్న పెద్దల సభకు వెళ్ళే అద్భుత అవకాశం కోసం సజ్జల సహా చాలా మందేపోటీ పడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత న్యాయవాది నిరంజన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇంకా మరి కొందరు కూడా రేసులో ఉన్నారని అంటున్నారు.అదే సమయంలో, ఎవరూ ఉహించని పేర్లు ఉన్నా ఆశ్చర్య పోనవసరం లేదని, అంటున్నారు.