విజయవాడ, ఏప్రిల్ 30,
విద్యుత్ కోతలు వేధిస్తున్నప్పటికీ.. ప్రత్యామ్నాయ చర్యలపై మాత్రం అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు. ప్రధానంగా విద్యుదుత్పత్తికి కావాల్సిన బొగ్గును సమకూర్చుకోవడంలో, విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన నిధులను చెల్లించడంలో ఇంధనశాఖ అధికారులు విఫలమౌతున్నారు. ఈ నేపథ్యంలోనే డబ్బులు ఇవ్వకపోతే బొగ్గు సరఫరా నిలిపివేస్తామంటూ సింగరేణి, మహానంది యాజమాన్యాలు హెచ్చరికలు చేస్తుంటే, లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద నగదు చెల్లింపులు జరగకపోతే విద్యుత్ సరఫరా ఆపివేస్తామంటూ ఎన్‌టిపిసి కూడా తాఖీదులు పంపిస్తోంది.ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనా ఉన్నా, ఆ డిమాండ్‌ను అందుకునే ముందస్తు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదు. ఫలితంగా ప్రజలు అప్రకిత విద్యుత్ కోతలతో సతమతమవుతున్నారు. కనీసం రెండు నెలలకు సరిపడా బొగ్గును నిల్వ ఉంచుకోవలసి ఉండగా ఆ దిశలో కూడా చర్యలు తీసుకోలేదు. అందువల్లనే బొగ్గు కంపెనీలకు పెద్ద మొత్తంలో బకాయిలు పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి నెలా బొగ్గు కోసం చెల్లించాల్సిన బకాయిలపై రాష్ట్ర ఇంధనశాఖకు లేఖలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ బకాయిలు సకాలంలో చెల్లించలేకపోతున్నారు.తాజా వివరాల మేరకు ఒక్క మహానంది కోల్ సంస్థకే 401 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీనిపై నిధులు కావాలని పదేపదే ఆర్ధికశాఖను ఇంధన శాఖ అధికారులు కోరుతున్నప్పటికీ నిధుల కేటాయింపులు జరగడం లేదు తాజాగా ఎన్‌టిపిసి కూడా బకాయిలపై లేఖలు రాసింది. రాష్ట్ర పవర్ కోఆర్డినేషన్ సంస్థ నుంచి రూ.1109 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇందులో రూ.355 కోట్లు ఇప్పటికే ఓవర్‌డ్యూస్‌గా మారిపోనున్నాయి. ఈ బకాయిలను 29వ తేదీలోగా చెల్లించకపోతే నిరంతర విద్యుత్ సరఫరా కష్టమేనని ఎన్‌టిపిసి అధికారులు చెబుతున్నారు. బకాయిలు తీర్చేందుకు నిధులు అందుబాటులో లేకపోవడం వల్లనే ఎన్‌పిఏకు చివరి క్షణాల్లో చెల్లింపులు జరుగుతున్నాయని అధికారులే అంగీకరిస్తున్నారు. అంటే ఒక నెలలో చెల్లించాల్సిన బకాయిలను మూడు నెలలకు చెల్లిస్తున్నట్లు కనిపిస్తోంది.