YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాఫీ రైతులకు కానరాని ప్రోత్సాహం

కాఫీ రైతులకు కానరాని ప్రోత్సాహం

విశాఖపట్టణం, ఏప్రిల్ 30,
అరకు కాఫీ అంతర్జాతీయంగా ఖ్యాతి గడించినప్పటికీ దాన్ని పండించిన గిరిజన రైతుకు మాత్రం ప్రోత్సాహం కరువైంది. మార్కెట్‌లో లభించిన గుర్తింపు, ప్రతిఫలం గిరిజనులకు దక్కడం లేదు. గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆశించిన స్థాయిలో కాఫీ గింజలను కొనుగోలు చేయకపోవడంతో నాంది, టాటా వంటి ప్రయివేటు సంస్థలు ఏజెన్సీలో నాటుకుపోయాయి. జిసిసి కంటే కాస్త ఎక్కువ ధరను చెల్లించడంతో అత్యధిక భాగం కాఫీ గింజలు ఆ సంస్థలే కొనుగోలు చేస్తున్నాయి. ప్రయివేటు సంస్థలకు ధీటుగా ధర చెల్లించి కాఫీ గింజలు కొనుగోలు చేసి మార్కెటింగ్‌ చేసుకొనే అవకాశం జిసిసికి ఉన్నప్పటికీ ఆ ప్రయత్నం చేయడంలేదు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం, ప్రోత్సాహం లేకపోవడంతో జిసిసి మార్కెట్‌ పోటీకి అనుగుణంగా ముందుకు వెళ్లలేకపోతోంది.అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని కొయ్యూరు, అనంతగిరి, అరకు, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, జికె.వీధి, చింతపల్లి మండలాల్లోని 1.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. దాదాపు 1.54 లక్షల మంది రైతులు కాఫీ పంట సాగు చేస్తున్నారు. రూ.200 కోట్లకుపైగా విలువైన 11 వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ పండుతోంది. దీనిలో ఈ ఏడాది రెండు వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ గింజలు కొనుగోలు చేయాలని జిసిసి నిర్ణయించి, 627 మంది రైతుల నుంచి 2.40 కోట్ల విలువైన 135 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేసింది.  కాఫీ కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జిసిసి మార్కెట్‌లో ప్రయివేటు సంస్థలు చెల్లించిన ధరను రైతులకు ఇవ్వలేకపోయింది. దీంతో ప్రయివేటు వ్యాపారులకు రైతులు అమ్ముకుంటున్నారు. సీజన్‌ అర్ధ భాగంలో పార్చ్‌మెంట్‌, అరబిక చెర్రీ గింజలకు జిసిసి ధర పెంచినా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ప్రయివేటు సంస్థలు, జిసిసి చెల్లిస్తున్న ధరకు మధ్య వ్యత్యాసం ఉండడంతో జిసిసి 135 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగలిగింది. కిలో అరబిక పార్చ్‌మెంట్‌ కాఫీ గింజలకు ప్రయివేటు వ్యాపారులు రూ.280 చెల్లిస్తున్నారు. ఆ ధరను జిసిసి రూ.180 నుంచి రూ.260 పెంచినా రూ.20 వ్యతాసం ఉండడంతో ప్రయివేటు వ్యాపారులకే గిరిజనులు అమ్ముకున్నారు. అరబిక చెర్రీ కాఫీకి ప్రయివేటు వ్యాపారులు కిలోకు రూ.125 చెల్లిస్తున్నారు. దీనికి తొలుత జిసిసి రూ.75 చెల్లించి, తరువాత రూ.110 పెంచింది. ప్రయివేటు వ్యాపార సంస్థలు చెల్లిస్తున్న ధరకు దగ్గరగా సీజన్‌ చివరిలో జిసిసి ధర పెంచింది. అప్పటికే ప్రయివేటు వ్యాపార సంస్థలు రైతుల నుంచి కొనుగోలు చేయడంతో జిసిసి తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ప్రయివేటు సంస్థలు చెల్లిస్తున్న ధరకు తగినట్లు జిసిసి ధర పెంచి చెల్లించేలా కాఫీ ఎపెక్స్‌ కమిటీ సీజన్‌ ఆరంభంలో నిర్ణయం తీసుకుంటే లక్ష్యాన్ని చేరుకున్నది.

Related Posts