నెల్లూరు, ఏప్రిల్ 30,
మూడేళ్లుగా ఏపీలో పాలన ఎంత అధ్వాన్నంగా జరుగుతోందో అందరికీ తెలుసు. ఎవరిని అడిగినా.. జగన్ పాలన కష్టాలు ఏకరువు పెడతారు. అధికారపక్షం మాత్రం అలాంటిదేమీ లేదంటూ.. సంక్షేమ పథకాల పేర్లు చెప్పి సమస్యలను కప్పెడుతోంది. అయితే, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మాత్రం అలా కాదు. అధికార పార్టీలో ఉన్నా.. పాలనలో తప్పులను, ప్రభుత్వ పొరబాట్లను, సొంతపార్టీ నేతల ఆగడాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రజల కోసం.. లోటుపాట్లపై తన వాయిస్‌ను బలంగా వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా, సీఎం జగన్‌ను తప్పుదారి పట్టిస్తున్నారంటూ వైసీపీ నేతలు, అధికారులపై మండిపడ్డారు ఆనం. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో అలజడి రేపుతున్నాయి. సీఎం జగన్‌కు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనతో తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారంటూ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో వెనుకబడ్డామని.. సమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. సోమశిల కాలువలు సరిగా లేవని.. చివరి వరకు నీరు పోవడం లేదని అసలు వాస్తవం చెప్పారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా వచ్చారని.. ఆయన అయినా మాట వింటారని అనుకుంటున్నామని ఆనం అన్నారు. ముఖ్యమంత్రి మాటలను ఇక్కడి పాలకులు అబద్దాలు చేస్తున్నారని.. నెల్లూరు, సంగం వంతెనలు ప్రారంభిస్తామంటూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. నీటిపారుదలశాఖ అధికారులు సీఎంవోకి వాస్తవాలు చెప్పాలన్నారు. మూడేళ్లుగా 20 శాతం కూడా పనులు చేయలేకపోతున్నారని.. పరువుపోతోందని ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటలతో మేడిపండు లాంటి జగన్ పాలన డొల్లతనం పబ్లిక్‌గా బయటపెట్టారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.