విజయవాడ, ఏప్రిల్ 30,
అసంపూర్తిగా ఉన్న సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బికె), హెల్త్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీ తదితర భవన నిర్మాణాలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంటు నిధులతో చేపట్టిన పలు భవనాల నిర్మాణాలు రెండేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని భవనాలనూ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల కలెక్టర్లు, ఎస్‌పిలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఉపాధి పథకంలో వీలైనంత ఎక్కువ మట్టి పని చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో మెటీరియల్ నిధులను మంజూరయ్యేలా చూడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు సూచించారు. గతేడాదితో పోల్చితే రాష్ట్రానికి 50 శాతం పని దినాలు (మ్యాన్ డేస్) తగ్గినప్పటికీ, మూడు నెలల్లోనే వాటిని సద్వినియోగం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఆ మేరకు ఉపాధి పథకం అధికారులు జిల్లాల వారీ ఉపాధి పని దినాల ప్రణాళికను రూపొందించారు. ప్రతి జిల్లాలోనూ రోజుకు లక్ష పని దినాల చొప్పున నెలకు కనీసం 25 లక్షల పని దినాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఉపాధి కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 14 కోట్ల మ్యాన్ డేస్‌ను మంజూరు చేసింది. ఇందులో ఈ నెలలో 2.10 కోట్ల పని దినాలకుగానూ ఇప్పటి వరకు 2.04 కోట్ల పని దినాలను కల్పించినట్లు అధికారులు తెలిపారు. మే నాటికి 7.70 కోట్లు, జూన్ నాటికి 12 కోట్ల పని దినాలను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను అధికారులు రూపొందించారు. ఉపాధి పనుల్లో ఎంతమేర మట్టి పని జరిగితే మెటీరియల్ నిధులు అంత ఎక్కువగా విడుదలవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆ నిధులతో అసంపూర్తిగా ఉన్న సచివాలయాలు, ఆర్‌బికె, డిజిటల్ లైబ్రరీలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు వీలుంటుందంటున్నారు.గతేడాది ఉపాధి మెటీరియల్ కింద రాష్ట్రానికి సుమారు రూ.3,340.54 కోట్లు రావాల్సి ఉండగా, రూ.1,943.88 కోట్లే మంజూరయ్యాయి. మిగిలిన నిధులను ఈ నెలాఖరులోగా మంజూరు చేయించేందుకు ఉపాధి పథకం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకు లేఖ రాయనున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం లేబర్ బడ్జెట్ ప్రకారం రాష్ట్రానికి రూ.2,504 కోట్ల మెటీరియల్ నిధులను కేంద్రం మంజూరు చేసింది. అందులో మూడు విడతల్లో రూ.1943.88 కోట్లు మంజూరయ్యాయి.మెటీరియల్ నిధులు ఇంకా రూ.835.99 కోట్లు రావాల్సి ఉంది. మెటీరియల్ నిధులతో 44,119 సచివాలయ, ఆర్‌బికె, హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీ తదితర భవన నిర్మాణాలకు 28,989 గ్రౌండింగ్ అవ్వగా, వాటిలో ఇప్పటి వరకు 7,809 మాత్రమే పూర్తయ్యాయి. చేసిన పనులకు బిల్లులు మంజూరుకాకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలను ఆపేశారు. ఈ నెలాఖరులోగా బకాయిలను విడుదల చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సాక్షాత్తు సిఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో డిప్యూటీ సిఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఉపాధి పనులు, పెండింగ్ బకాయిలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.