తిరుపతి, ఏప్రిల 30,
కేటీఆర్ కామెంట్లు ఏపీలో కాక రేపుతున్నాయి. పక్క రాష్ట్రంలో కరెంట్ ఉండదు.. నీళ్లు ఉండవు.. రోడ్లు అధ్వానం అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. మంత్రులంతా పోలోమంటూ కౌంటర్ ఇస్తూ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరెడ్డి, జోగి రమేశ్, బొత్స, రోజా.. ఇలా మంత్రులంతా ఎవరికి తోచిన బాషలో వాళ్లు మా ఏపీ గొప్ప.. అంటూ కవర్ చేస్తున్నారు. ఇక రోజా అయితే సంథింగ్ డిఫరెంట్. ఓ వైపు కరెంట్ మంటలు సెగలు పుట్టిస్తుంటే.. రోజా మాత్రం నేరుగా ప్రగతిభవన్ వెళ్లారు. సీఎం కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా కలిశారు. తనకు మంత్రి పదవి వచ్చినందుకు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కట్ చేస్తే.. ప్రగతి భవన్ నుంచి బయటకు రాగానే.. కేటీఆర్‌కు కౌంటర్ వేసి మరింత కామెడీ చేశారు. ఏపీకి వస్తే అభివృద్ధి చూపిస్తానంటూ రోజా ఆహ్వానించారు. అదేంటి.. ప్రగతిభవన్‌లో నవ్వుతూ ఫోటోలు దిగి.. బయటకు రాగానే విమర్శలా? అంటూ నెటిజన్లు రోజాను సోషల్ మీడియాలో కుమ్మేస్తున్నారు. జబర్థస్త్ కామెడీ అంటూ.. దొందు దొందేనంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏపీ మంత్రుల విమర్శల్లో బొత్స సత్యనారాయణ చాలా వెరైటీగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ చెప్పేదంతా అబద్దం.. నేను ఇటీవలే హైదరాబాద్‌లో ఉండివచ్చా.. అక్కడ కరెంట్ లేదు.. జనరేటర్ వేసుకోవాల్సి వచ్చిందంటూ పిచ్చ కామెడీ చేశారు. అయితే, బొత్స వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చారు. "తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోదు. బహుషా, బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో. అందుకే కరెంట్ కట్ చేశారు కావొచ్చు. వైసీపీ నేతల కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. ఇక్కడే ఉన్న జగన్ కుటుంబాన్ని అడిగినా తెలుస్తుంది. కేసీఆర్ పాలన బాగుందని వైసీపీ ఎంపీలే చెప్పారు" అంటూ ఆయన వేసిన సెటైర్ భలే పేలింది. మంత్రి బొత్సను సైతం హైదరాబాద్‌లో ఉండే ఏపీ వాసులు పోస్టులతో ఆటాడుకుంటున్నారు. బొత్స ఉన్నది ఎక్కడో చెప్పాలని.. మాకు మాత్రం ఇక్కడ ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవట్లేదని.. బొత్స చెప్పేదంతా అబద్దమని.. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వాసుల బంధువులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌తో బొత్సను చెడుగుడు ఆడుకుంటున్నారు.