విశాఖపట్నం
విశాఖపట్నం ఎండాడ లోని దిశ పోలీస్ స్టేషన్ ను హోం శాఖ మంత్రి తానేటి వనిత సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కల్యాణి, మేయర్, ఇతర వైస్సార్సీపీ నాయకులు, నగర సీపీ శ్రీకాంత్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దిశ పోలీసు స్టేషన్ ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. మహిళల భద్రత విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.
వనిత మాట్లాడుతూ మహిళ భద్రతకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారు. మహిళ రక్షణ కోసం దిశ చట్టాన్ని రూపొందించడం జరిగింది. మహిళల కోసం ప్రత్యేకంగా దిశ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశాము. మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి దిశ పోలీసు స్టేషన్లు ఎంతగానో ఉపయోపడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మహిళపై దాడులు జరిగినప్పుడు వారు తమ బాధను చెప్పుకొనేందుకు దిశ వంటి స్టేషన్లు లేవు. ప్రతి దిశ పోలీసు స్టేషన్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలను సీఎం ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాలో 7 లక్షల 31 వేల మంది దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది వందల మంది మహిళలు దిశ ఎస్వోఎస్ ద్వారా రక్షణ పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 24 లక్షల మందికి పైగా దిశ యాప్ ను డౌన్లోడ్ చెసుకున్నారు. దిశ యాప్ వలన వ్యక్తి గత వివరాలు బైటకు వస్తాయని అపోహలు వద్దని అన్నారు.
రాష్ట్రంలో దిశ పోలీసు స్టేషన్ల పని తీరు అద్భుతంగా ఉంది. చదువుకొనే విద్యార్దినిలు దిశ యాప్ ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి. మహిళల రక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పరిపాలన చేస్తున్నారని అన్నారు.