విజయవాడ, మే 2,
ఏపీలో రోజూ నాలుగుదై అత్యాచార కేసులు వెలుగులోకి వస్తున్నాయి. హత్యలూ తగ్గడం లేదు. దాడుల సంగతి చెప్పాల్సిన పని లేదు. అన్నింటికీ వీడియో సాక్ష్యాలు లభ్యమవుతున్నాయి. నేరస్తులు పేట్రేగిపోతున్నారు. ఎవరికీ భయం ఉండటం లేదు. పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నారో కాపాడుతున్నారో తెలియని పరిస్థితి . మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయనిరచ్చ జరుగుతూ ఉండగానే సంచలనాత్మక గ్యాంగ్ రేప్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కుప్పం నుంచి సిక్కోలు వరూక బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరంలో ఓ యువతిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చేశారు.. రేపల్లే రైల్వే స్టేషన్‌లో వలస కూలీని అచ్చంగా సినిమాల్లో చూపించినట్లుగా గ్యాంగ రేప్‌కు పాల్పడ్డారు. కేసును ఛేదించడం… నేరస్తుల్ని పట్టుకోవడం సంగతి తర్వాత అసలు నేరం చేసేవాళ్లకు.. ఏమీ కాదనే భరోసా… ఏమవుతుందిలే ధీమా పెరిగిపోయిందని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. నేరస్వభావం ఉన్న వారు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. అలాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న సందర్భాలు లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మంగళగిరిలో నాగిరెడ్డి అనే వ్యక్తి వృద్ధుడ్ని ఇష్టం వచ్చినట్లుగా కొడితే పట్టించుకున్న వారు లేరు. అనంతపురం జిల్లా చిలమత్తూరులో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తిని ఎస్‌ఐ చితక్కొట్టాడు. ఈ రెండు ఘటనలు రెండు రోజుల్లో చోటు చేసుకున్నవే. పోలీసుల తీరు ఇలా ఉంటే.. నేరస్తులు రెచ్చిపోకుండా ఉంటారా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఏ చట్ట అయినా నిలబడాలంటే… ఆమ్మో శిక్ష పడుతుందేమో అన్న భయం నేరస్తుల్లో ఏర్పడాలి. కానీ అలాంటివి ఏర్పడుతున్న సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా చట్టం ఫెయిలవుతోంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు…. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైనం చూస్తే.. ఒకప్పుడు బీహార్‌లో ఉండే అక్రమాలు.. అరాచకాలు గుర్తుకు వస్తున్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ అంశాలపై సీరియస్‌గా దృష్టి పెట్టి తన..మన అని కాకుండా చట్టాన్ని అమలు చేస్తే.. వ్యవస్థ నిలబడుతుంది. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది.