విజయవాడ, మే 2,
విజయవాడలో డ్రగ్స్ కలకలం రేగింది. గతంలో జరిగిన ఘటనను మరవకముందే మరోసారి మత్తు పదార్థాలు బయటపడటం సంచనలనంగా మారింది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన సాయిగోపి అనే వ్యక్తి పంపిన పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నట్లు బెంగళూరులోగుర్తించారు. పార్శిల్ గురించి ఆరా తీయగా.. విజయవాడ డీటీఎస్ నుంచి సరైన వివరాలతో కెనడాకు వెళ్లినట్లు గుర్తించారు. పార్శిల్ లో నాలుగు కిలోల మత్తు పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన కొరియర్ బాయ్ తేజను గత నెల 27న బెంగళూరు పిలిపించి విచారించారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. పట్టుబడిన పార్శిల్‌లో పిరిడిన్ అనే నిషేధిత డ్రగ్‌ను గుర్తించారు. అనంతరం కస్టమ్స్ అధికారులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. డ్రగ్స్ కలకలం రేగడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. మత్తు పదార్థాలు ఎక్కడ నుంచి వస్తుందనే అంశంపై వివరాలు సేకరించేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఒక బృందాన్ని సత్తెనపల్లికి(, మరో బృందాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారుల వద్దకు పంపారు. సాయిగోపి ఇటీవల రెండు సార్లు పచ్చళ్ల పార్శిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో నిజంగా పచ్చళ్లు పంపాడా? లేదా ఇప్పటి లాగే డ్రగ్స్‌ను పంపాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గుజరాత్ ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసులో విజయవాడకు ప్రమేయం ఉందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. డ్రగ్స్ పై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్‌లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా ముంద్రా పోర్టుకు హెరాయిన్ సరఫరా అయినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. విజయవాడ సత్యనారాయణపురం గడియారం వారి వీధిలోని ఇంటి నెంబర్ 23-14-16 చిరునామాతో మాచవరం సుధాకర్ ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్ట్రర్ చేశారు. ఎన్ఐఏ అధికారులు ఆ ఇంట్లో సోదాలు చేశారు. స్థానికులను విచారించి వాంగ్మూలాలు తీసుకున్నారు.