మీడియాకు ఉన్న వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలను పరిపూర్ణంగా అనుమతించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదో తప్పుడు రిపోర్టింగ్ చేశారంటూ పరువు నష్టం పేరుతో పత్రికలను వెంటాడకూడదని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చిందిఓ పాత్రికేయుడితోపాటు ఓ మీడియా సంస్థపై పరువు నష్టం ఫిర్యాదును పాట్నా హైకోర్టు కొట్టివేయడంతో పిటిషనర్ సుప్రీంకోర్టులో అపీలు చేశారు. ఈ అపీలును సుప్రీంకోర్టు అనుమతించలేదు.ప్రజాస్వామ్యంలో సహనంగా ఉండటాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. కుంభకోణం ఆరోపణలపై రిపోర్టింగ్ చేసేటపుడు ఉత్సాహం కానీ, కొంత వరకు తప్పు కానీ ఉండవచ్చునని, అయితే, పత్రికా రంగానికి పరిపూర్ణంగా భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం కల్పించాలని తెలిపింది. తప్పుడు రిపోర్టింగ్ ఉంటే ఉండవచ్చునని, దాని కోసం వారిపై పరువునష్టం కేసులతో వెంటాడకూడదని వివరించింది. ఓ కుంభకోణం గురించి సరైనది కానటువంటి వార్తను ప్రచురించడమనేది పరువు నష్టం కలిగించే వార్త కాబోదని గతంలో ఇచ్చిన తీర్పును మరోసారి గుర్తు చేసింది.