హైదరాబాద్, మే 2,
విద్యుత్ కోతలు.. నీళ్లు లేవు.. రోడ్లు అధ్వానం … అసలు ఏపీలో మౌలిక సదుపాయాలే లేవు.. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఒంటికాలిపై లేచి మరీ కౌంటర్లు వేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. మీడియా వేదికలెక్కారు. అఫ్ కోర్స్… ఏపీ మౌలిక సదుపాయాల విషయంలో తాను చేసిన కామెంట్లపై రాత్రికి రాత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వివరణ కూడా ఇచ్చుకున్నారనుకోండి.. అది వేరే సంగతి.అయితే.. ఒక పక్కన ఏపీ మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శల కౌంటర్ వేస్తున్న సమయంలోనే మంత్రి ఆర్కే రోజా మాత్రం.. కేటీఆర్ తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆయన నివాసంలో తన కుటుంబ సభ్యులతో సహా కలుసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. కేసీఆర్ ఆతిథ్యాన్ని, సన్మానాన్ని స్వీకరించడంతో పాటు కేసీఆర్ ను కూడా రోజా శాలువతో సన్మానించారు. ఒక పక్కన ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు- తెలంగాణ మంత్రి, ఎంపీ మధ్య వ్యాఖ్యల యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే మంత్రి రోజా కేసీఆర్ ఫ్యామిలీని కలుసుకోవడం చర్చనీయాంశం అయింది.
అక్కడితో ఆగని మంత్రి రోజా ‘కేటీఆర్ ను యంగ్ అండ్ డైనమిక్, ఇన్ స్పిరేషనల్ లీడర్ గా అందరం గుర్తిస్తాం’ అంటూ పొగడడం ఏపీ వైసీపీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. అంతటితో సరిపెట్టకుండా రోజా.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా ఏపీ గురించి మాట్లాడి ఉంటారని తాను అనుకోలేదని చెప్పడం పలువురికి ఆశ్చర్యం, ఆగ్రహం కలిగిస్తోంది. ‘పొరుగు రాష్ట్రాలు అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ అనలేదు’ అంటూ సమర్థించేందుకు రోజా చేసిన ప్రయత్నం సామాజిక మాధ్యమంలో ఆమెను ట్రోల్ చేయడానికి మాత్రమే దోహదపడింది.