విజయవాడ, మే 2,
వైసీపీమాజీ మంత్రుల తీరు చూస్తుంటే.. పార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనిపించక మానదు. సీఎం అభీష్టం మేరకు ఆయన అప్పగించిన బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని వారు చెప్పిన మాటలు పెదవుల చివరి నుంచి వచ్చినవేనన్నఅనుమానాలు పార్టీ కేడర్ లోనే వ్యక్తమౌతున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుజిల్లాలో చేసిన రచ్చమరువక ముందే.. ఆ స్థాయిలో కాకపోయినా మరో మాజీ మంత్రి పేర్ని నాని తన అసమ్మతినీ, అసంతృప్తినీసున్నితంగానే అయినా గుర్తించదగ్గ స్థాయిలో ప్రదర్శించారు. కేంద్ర మంత్రి పర్యటనలో మాజీ మంత్రి పేర్ని నాని అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. పర్యటన ఆద్యంతం ఒక ప్రేక్షకుడిలా దూర దూరంగా ఉండిపోయారు. గిలకల దిండి హార్బర్ పరిశీలనకు కేంద్ర మత్స్యశాఖ మంత్రి మురుగన్ పర్యటించారు. మంత్రి సిదిరి అప్పలరాజుతో కలిసి కేంద్ర మంత్రి గిలకలదిండి హార్బర్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని కూడా హాజరయ్యారు. అయితే ఆయన కనీసం మంత్రుల దగ్గరకు కూడా రాలేదు. ఏదో సంబంధం లేని కార్యక్రమానికి హాజరైనట్లుగా వారికి దూరంగా ఉండిపోయారు. మంత్రి సిదరి అప్పలరాజు స్వయంగా వెళ్లి పనుల పరిశీలనకు రావలసిందిగా కోరినప్పటికీ పేర్ని నాని పట్టించుకోలేదు. ఆ తరువాత జరిగిన సభలో మాత్రం మంత్రి మాట్లాడారు. ఆ మాటలు కూడా ముక్తసరిగా, ఆయన సహజ వాగ్ధాటిని భిన్నంగా ఉన్నాయి. కేంద్ర మంత్రి తెలుగులో చక్కగా మాట్లాడతారని ప్రశంసించి...తాను పనుల పరిశీలను దూరంగా ఉండటానికి ఎప్పుడూ చూసే పనులే కాదా అని ముక్తాయింపు ఇచ్చారు.పేర్ని నాని కేంద్ర మంత్రి పర్యటనకు హాజరై కూడా దూరదూరంగా మెలగడం, ముక్త సరిగా మాట్లాడటానికి కేబినెట్ లో స్థానం దక్కలేదన్న అసంతృప్తే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటే.. పార్టీ వర్గాలు తాను ఉంటే కొత్త మంత్రి స్వేచ్ఛగా మెలగలేరన్న భావనే పేర్ని నాని ఈ కార్యక్రమంలో అంటీముట్టనట్లు వ్యవహరించడానికి కారణమని చెబుతున్నారు.