YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కన్నడలో ఆపరేషన్ కమల్

కన్నడలో ఆపరేషన్ కమల్

కన్నడనాట ఆపరేషన్ కమల్ కలకలం సృష్టిస్తోంది. మెజార్టీ లేకపోయినా బీజేపీ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో రాష్ట్రంలో ఆపరేషన్ కమల్ నడుస్తోందంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.కన్నడనాట రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 104 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని అధికార గద్దెపై ప్రతిష్టించడంలో సఫలమయ్యారు. గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశాన్ని యడ్డీకే కల్పించారు. దీంతో ఆయన సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో యడ్యూరప్ప తన పంతం నెగ్గించుకున్నట్లైంది.ఎన్నికల జరిగిన రోజు.. మే 12వ తేదీన యడ్యూరప్ప తమ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. అంతేకాక తాను మే 17న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని తేల్చిచెప్పారు. అయితే హంగ్ రిజల్ట్ రావడంతో యడ్డీ కొంత ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ వివిధ రాజకీయ పరిణామాల అనంతరం ఆయనకు లైన్ క్లియర్ అయిపోయింది. ఆయనిచ్చిన ముందస్తు స్టేట్మెంట్ ప్రకారమే యడ్డీ సీఎంగా పగ్గాలు స్వీకరించారు. తన మాట నెరవేర్చుకున్నారు.కర్ణాటక అసెంబ్లీ పోరులో బీజేపీ 104 స్థానాలు దక్కించుకుని పెద్ద పార్టీగా నిలిచింది. ఇక కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 38 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానందున రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. కానీ గవర్నర్‌ మాత్రం అతి పెద్ద పార్టీగా నిలిచిన కాషాయపార్టీకే అవకాశం ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన15వ తేదీ.. యడ్డీ ప్రమాణం చేసిన 17వ తేదీ మధ్య ఆసక్తికర పాలిటీ సాగింది. ప్రధానంగా బీజేపీ ఆపరేషన్ కమల్ మొదలెట్టిందన్న వార్తలు వెల్లువెత్తాయి.బీజేపీ 104 సీట్లు సాధించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్‌ ఫిగర్‌ సాధించలేకపోయింది. 113 సీట్ల మార్క్ ను చేరుకోలేకపోయింది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ లు 116 సీట్లతో సర్కార్ ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చాయి. అయితే.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ.. తానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంది. ఈ మేరకు తనదైన రాజకీయానికి తెరతీసింది. కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమకు మద్దతిచ్చేందుకు రెడీగా ఉన్నారని.. అలా అయితే తమకే మెజార్టీ ఉంటుందని తేల్చిచెప్పింది. దీంతో కన్నడ రాజకీయం మరోసారి 2008 నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చింది.2008లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే అప్పుడు కూడా సరిగ్గా ఇప్పటిలాంటి పరిస్థితే ఎదుర్కొంది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్‌ ఫిగర్‌’కు మూడు సీట్లు తక్కువ పొందింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు డబ్బు, పదవి ప్రలోభాలు చూపించి తమవైపు తిప్పుకుంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముగ్గురు, జేడీఎస్‌ పార్టీ నుంచి నలుగురు ఎమ్మేల్యేల మద్దతుతో బీఎస్‌ యడ్యూరప్ప నాయకత్వంలో దక్షిణాదిలో తొలిసారిగా కాషాయ ప్రభుత్వం కొలువుతీరింది.పదవి కాంక్షతో బీజేపీ అవలంభించిన ఈ విధానాన్ని ప్రతిపక్ష పార్టీలు ‘ఆపరేషన్‌ లోటస్‌’గా నామకరణం చేసి, బీజేపీ పార్టీ చర్యలను తప్పు పట్టడమే కాక ఇలా చేయడం విలువలకు విరుద్ధమని విమర్శించాయి. అయితే అప్పుడు కూడా యడ్యూరప్ప ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం గమనార్హం. ఇదిలావుంటే యడ్యూరప్ప 2013లో బీజేపీ నుంచి బయటకు వచ్చి కర్ణాటక జనతా పక్ష పేరుతో పార్టీని స్థాపించారు. ఆ సమయంలో యడ్యూరప్ప ‘ఆపరేషన్‌ లోటస్‌’పై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అప్పట్లో అసెంబ్లీలో బీజేపీ బలాన్ని పెంచడానికి తాను ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్టు వెల్లడించారు.ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ 2008 నాటి పరిస్థితులే తలెత్తాయి. ఇప్పడు కూడా బీజేపీ, కాంగ్రెకస్‌, జేడీఎస్‌లు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ 104 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్‌ ఫిగర్‌’ను చేరుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో మరోసారి ‘ఆపరేషన్‌ లోటస్‌’కు బీజేపీ తెర తీసిందని ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని నిరసిస్తూ ఆందోళనలకు దిగాయి. కర్ణాటకలో అధికారంలోకి రావాలని బీజేపీ.. కాషాయ వర్గాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్ లు తీవ్రంగా యత్నించాయి. ఏదైతేనేం.. ప్రత్యర్ధి పార్టీల నేతలను బీజేపీ ఆకట్టుకోగలిగింది. అధికారం చేజిక్కించుకుంది.

Related Posts