బెంగళూరు మే 2
కర్నాటకలో ముఖ్యమంత్రిని మార్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత సీఎం బొమ్మైని మార్చేయాలని బీజేపీ ఆలోచన.పక్కాగా ఓ నిర్ణయానికి రాకపోయినా… ఆ దిశగా బీజేపీ ముఖ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక… ఇలాంటి పుకార్లు వస్తున్న సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగళూరులో పర్యటిస్తున్నారు. కీలక నేతలతో భేటీ అయ్యే ఛాన్స్ ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అతి త్వరలోనే బొమ్మై తన కేబినెట్‌ను విస్తరిస్తారని, ఈ విస్తరణ పూర్తవ్వగానే ఆయన పదవీ నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది.ఇక.. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కింది నుంచి పై స్థాయి వరకు తాము మార్పులు చేయాలనుకుంటే చేసేస్తామని, అందులో ఏమాత్రం సంకోచించమని గుజరాత్, ఢిల్లీ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించారు. ఇలా ఒక్కసారిగా మార్పులు చేయడం బీజేపీలో సాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు.కర్నాటకలో ప్రస్తుతం బీఎల్ సంతోశ్ వ్యాఖ్యలనే అందరూ ఉటంకిస్తున్నారు. అతి త్వరలోనే సీఎం బొమ్మై స్థానంలో కొత్త వ్యక్తి సీఎంగా వస్తారని పరోక్షంగా పేర్కొంటున్నారు. అయితే ఈ పుకార్లపై సీఎం బొమ్మై స్పందించలేదు.