విశాఖపట్టణం మే 2
తాను చదివిన కంప్యూటర్ సైన్స్ పరిజ్ఞానంతో ఏకంగా ఎమ్మెల్యేలకే కుచ్చుటోపీ పెట్టాడో యువకుడు. ముఖ్యమంత్రి పేరును వాడుకుంటూ ఎమ్మెల్యేల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు. అక్రమంగా కూడబెట్టిన డబ్బుతో తన ప్రియురాలికి ఓ భవంతిని కట్టించి ఇచ్చాడు. గత కొన్నేండ్లుగా మోసాలకు పాల్పడుతున్న విశాఖ యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకెళితే.. విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్‌కు చెందిన విష్ణుమూర్తి అలియాస్ సాగర్ అనే యువకుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తక్కువ టైమ్‌లో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనే కలలు గన్నాడు. ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తే పెద్దమొత్తంలో రాబట్టొచ్చని ఆలోచించాడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానంటూ ఎమ్మెల్యే సందీప్ యాదవ్‌కు ఫోన్ చేసి పరిచయమైన విష్ణుమూర్తి.. అర్జంట్‌గా రూ.20 లక్షలు కావాలని కోరాడు. పలు మార్లు ఫోన్ చేస్తూ డబ్బు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయసాగాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ ఎమ్మెల్యే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన బివాడీ ఇన్‌స్పెక్టర్ జితేంద్రసింగ్ నేతృత్వంలోని సిబ్బంది.. నిందితుడి ఫోన్ లొకేషన్ ఆదారంగా ఎక్కడ ఉన్నది గుర్తించి పట్టుకున్నారు. అనంతరం ట్రాన్సిట్ వారంట్‌పై రాజస్థాన్‌కు తరలించారు. ఇలాఉండగా, ఇప్పటికే సీఎంఓ నుంచి మాట్లాడుతున్నానంటూ చెప్పి పలువురు ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్ చేసి దాదాపు రూ.2 కోట్లు విష్ణుమూర్తి వసూలు చేసినట్లు తెలుస్తున్నది. కాగా, ఈ మొత్తం నుంచి తన ప్రియురాలి కోసం గాజువాకలో రూ.80 లక్షలతో ఇల్లు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విష్ణుమూర్తిపై ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మూడేండ్ల క్రితం కూడా ఏపీకి చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.