విజయవాడ. మే 3,
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షాపత్రాల లీకేజీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే పేపర్ లీక్ అవుతున్నాయి. రోజుకో ప్రాంతంలో ప్రశ్నపత్రం లీకేజీ వార్తలు వస్తూనే ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే విద్యార్థుల విలువైన సమయం వృథా అయింది. తాజాగా ప్రశ్నపత్రాల లీక్వ్యవహారం విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కలుగిస్తోంది. నంద్యాల, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో జరిగిన పేపర్ లీకేజీ ఘటనలను మరవకముందే మరోసారి కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లాల్లో పేపర్ లీక్ ఘటనలు సంచలనంగా మారాయి. కర్నూలు జిల్లా ఆలూరులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. సోమవారం మ్యాథ్స్ పేపర్ సెల్ ఫోన్ లో ప్రత్యక్షమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేపర్ లీక్ అవడంతో జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. పరీక్ష కేంద్రం వద్ద ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో తామే స్వయంగా పరీక్ష పత్రాల ఫొటోలు తీసుకొచ్చినట్లు యువకులు అంగీకరించారు. పరీక్ష జరుగుతుండగా ఓ యువకుడు అతని స్నేహితులకు కాపీ చిట్టీలు వేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై యువకుడిని గుర్తించి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసి పరిశీలించగా ప్రశ్నాపత్రం కనిపించింది. ఎస్సై ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ.. ఎవరెవరి హస్తం ఉందన్న దానిపై విచారణ చేపట్టారుమరో ఘటనలో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. సమాధానాల చిట్టీలను ఎగ్జామ్ సెంటర్ కు పంపుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. సమాచారం అందుకున్న విద్యాశాఖ, పోలీస్ అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. మరో వైపు ఈ పేపర్ లీక్ అయిన విషయం తెలిసి, జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. యువకుల్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. తామే స్వయంగా పరీక్ష పత్రాలు ఫోటోలు తీసుకొచ్చినట్టు వాళ్ళు అంగీకరించారు. కాపీ చిట్టీలు మార్చుకుంటున్న సమయంలో, ఆ యువకులు అడ్డంగా దొరికారు. సెల్‌ఫోన్ తీసి పరిశీలిస్తే, ప్రశ్నాపత్రం లీకైన మేటర్ వెలుగులోకి వచ్చింది. దీని వెనుక ఎవరి హస్తముందో విచారించాలని ఎస్పీ ఆదేశించారు. మరోవైపు.. వరుసగా ఈ లీకేజ్ ఘటనలు వెలుగుచూస్తుండడంతో, ప్రభుత్వం సీరియస్ అయ్యింది.ఇప్పటివరకు ఈ పత్రాల్ని లీక్ చేసిన 42 మంది టీచర్లు అరెస్ట్ అవ్వగా.. ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ఉద్దేశ్యపూర్వకంగా మాల్ ప్రాక్టీస్ వ్యవహారాలు జరుగుతున్నాయని విద్యా శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇది నిజమేనని రుజువైతే, ఆయా టీచర్స్ని విధుల నుంచి తొలగించాలని విద్యా శాఖ యోచిస్తోంది. ఈ మాల్ ప్రాక్టీస్ ఎపిసోడుపై మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి విద్యా శాఖ సిద్ధమవుతోంది.