విశాఖపట్టణం, మే 3
నీలి సముద్రంపై నౌకా విహారం ఓ మధురమైన అనుభూతి. పర్యాటక విడిది కేంద్రం అండమాన్ వెళ్ళొచ్చే ఛాన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. అటువంటి వారి కోసం ఓ గుడ్ న్యూస్. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ నుంచి పోర్ట్ బ్లెయిర్ కు ప్యాసింజర్ షిప్ రాక పోకలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్రకు అండమాన్ నికోబార్ దీవులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వేలాది మంది అక్కడకు వెళుతుంటారు. ఇక, ఐ ల్యాండ్స్ అందాలను ఆస్వాదించాలని కోరుకునే పర్యాటకుల సంఖ్య ఎక్కువే. అండమాన్-విశాఖ మధ్య ప్రారంభమైన నౌకాయానం టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో..హర్షవర్ధన్ నౌకను సిద్ధం చేస్తున్నారు షిప్పింగ్ కార్పొరేషన్ అధికారులు.ఇలా వివిధ అవసరాల కోసం పోర్ట్ సిటీ నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య వందల్లో ఉంటుంది. దీంతో అండ మాన్ షిప్పులకు క్రేజ్ ఎక్కువ. తక్కువ ధరలో ప్రయాణం అందు బాటులో ఉండటం, నౌకావిహారం ఆస్వాదించే అవకాశం కలిసి రావడంతో ఎక్కువ మంది ప్యాసింజర్ షిప్పులనే ఎంచుకుంటారు. కరోనా వ్యాప్తి చెందడం… లాక్‌డౌన్ కారణంగా.. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండేళ్ల పాటు రాకపోకలను నిలిపివేసింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణిగగా తిరిగి నౌకాయానం పునఃప్రారంభమైంది. 450 మంది ప్రయాణికులతో పోర్టుబ్లెయిర్‌లో పాసింజర్ కార్గో షిప్ క్యాంప్‌బెల్ బే బయలుదేరింది. మూడు రోజుల ప్రయాణం తర్వాత విశాఖపట్నం పోర్టుకు ఈ నెల 3వ తేదీ ఉదయం చేరుకోనుంది. ఇందులో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే 95 శాతం మంది ఉన్నట్టు షిప్పింగ్ వర్గాలు చెబుతున్నాయి. అండమాన్ నికోబార్‌లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నవారంతా.. వేసవి సెలవుల కోసం తమ స్వస్థలాలకు బయలుదేరడంతో డిమాండ్ ఎక్కువైంది. చాలా కాలం తరువాత వైజాగ్ హార్బర్ కు వస్తున్న అండమాన్ షిప్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది వైజాగ్ పోర్ట్ ట్రస్ట్. షిప్‌కు బెర్తు, ఇతర సౌకర్యాలు కల్పించారు. విశాఖపట్నం నుంచి అండమాన్ పోర్టు బ్లెయిర్‌కు తొలినాళ్లలో మూడు నెలలకోసారి పాసింజర్ షిప్ నడిచేది. డిమాండ్ పెరగడంతో అందుకు తగ్గట్టుగానే ఫ్రీక్వెన్సీ ఎక్కువైంది. మొదట్లో ఎంవీ స్వరాజ్‌ద్వీప్ నౌక రాకపోకలు సాగించేది. తర్వాత ఎంవీ హర్షవర్థన్ వచ్చింది. ఇప్పుడు క్యాంప్ బెల్ రాకపోకలు సాగిస్తోంది. అండమాన్‌కు ప్రయాణికులను రెండు రకాలుగా విభజించారు. అండమాన్ ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రయాణికుడిని ఐలాండర్ అనీ.. పర్యాటకుల్ని నాన్ ఐలాండర్‌గా షిప్ టికెట్స్ విక్రయంలో విభజిస్తారు. ఐలాండర్‌కు జనరల్ టికెట్ కేవలం 1250 మాత్రమే కాగా.. పర్యాటకుడికి జనరల్ టికెట్ 3,375రూపాయలు. విశాఖ నుంచి అండమాన్‌కు విమానంలో వెళ్లాలంటే 10 వేల వరకూ ఖర్చవుతుంది.