విజయనగరం, మే 3,
వడ్డించే వాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా ఫర్వాలేదు' అన్న చందంగా అధికారి మనవాడైతే పనుల్లో నాణ్యత లేకపోయినా ఫర్వాలేదు చకచకా పనులు చేయించి బిల్లులు చేయించుకోవచ్చును. లక్షలాది రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు కాలం పూర్తికాక ముందే శిథిలావస్థకు చేరుకున్నాయంటే పనుల్లో నాణ్యత ఏ విధంగా ఉందో వీటిని చూస్తేనే అర్థం చేసుకోవచ్చును. మండల కేంద్రంలోని విద్యుత్, శిశు సమగ్ర సంక్షేమ, వ్యవసాయం, మండల పరిషత్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య కేంద్రాలతో పాటు చిట్టపూడివలస, రేగులపాడు, బొడ్లపాడు, పనస నందివాడ, తెట్టంగి, విక్రంపురం, కంబర వలస, ఎం.రాజపురం, కత్తుల కవిటి తదితర గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. చిన్నపాటి చినుకుపడ్డా వర్షం నీరంతా శ్లాబ్‌పై నుంచి కిందకు జారి గోడలు బీటలు వారి దర్శనమిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఈ భవనాలు కుప్పకూలిపోతాయో తెలియని పరిస్థితి.కంబరవలస, విక్రంపురం, పనస నందివాడ అంగన్వాడీ కేంద్రాలతో పాటు మండల వ్యవసాయశాఖ, ఎంపిడిఒ వంటి ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు సొంత గూడు లేకపోవడంతో పరాయి పంచన విధులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో ఓ పక్క వ్యవసాయశాఖకు సంబంధించి కార్యకలాపాలు జరుపుతున్నారు. ఇంతవరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్న మండల పరిషత్ కార్యాలయం నిర్వహణ జరిగేది. ఇది పాథమిక ఆరోగ్య కేంద్రం స్థలమైనందున సొంత గూడు లేక ఇక్కడ నుంచి బిసి బాలికల వసతి గృహంలో మండల పరిషత్తు కార్యకలాపాలు కొనసాగు తున్నాయి. ప్రభుత్వం స్పందించి కార్యాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.