YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కన్నడకు మరో కొత్త సీఎం..?

కన్నడకు మరో కొత్త సీఎం..?

బెంగళూర్, మే 3,
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ క్యాబినెట్ కూర్పు, ముఖ్యమంత్రి మార్పుపైనా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగళూరుకు వస్తుండటంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. యడియూరప్ప స్థానంలో 9 నెలల కిందట సీఎంగా పగ్గాలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై వ్యతిరేకవర్గం ఆయన మార్పుపై డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల వరుస వివాదాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు వాకిటి నిలవాలంటే సంఘ పరివార్‌ మూలాలున్న నేతకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని కొత్త వాదనను తెరపైకి తీసుకు వచ్చారు. గుజరాత్‌లోనూ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సీఎం మార్చినట్లు ఇక్కడా చేస్తేనే విజయం తథ్యమని కరుడగట్టిన కమలనాథులు వాదిస్తున్నారు.అలాగే, పార్టీ అధ్యక్షునిగా నళిన్‌కుమార్‌ కటీల్‌ను తొలగించి, ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన శోభా కరంద్లాజె, సీటీ రవి, డాక్టర్ అశ్వత్థ నారాయణల్లో ఒకరికి ఇవ్వాలని మరికొందరు అధిష్ఠానానికి సూచించారు. సీఎంగా లింగాయత్‌కు చెందిన బొమ్మైకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక్కలిగలను ఎంపిక చేయాలని సిఫార్సు చేశారు. ఒక్కలిగల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పాత మైసూరు, హాసన, రామనగర తదితర ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెల్చుకోవాలంటే అధ్యక్షునిగా బాధ్యతలను ఆ వర్గానికి ఇవ్వాలని నేతలు వాదిస్తున్నారు.ఢిల్లీ, గుజరాత్‌లలో స్థానిక ఎన్నికలను ఉటంకిస్తూ రాష్ట్ర నాయకత్వాలలో మూకుమ్మడి మార్పులు చేసే ధైర్యం, బలం తమ పార్టీ నాయకత్వానికి ఉందని బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ అన్నారు. ‘‘ఇది అన్ని చోట్లా జరుగుతుందని నేను చెప్పడం లేదు.. కానీ ఇతర రాజకీయ పార్టీలు కూడా ఊహించని నిర్ణయాలు బీజేపీ తీసుకోగలుగుతోంది.. పార్టీపై ఉన్న విశ్వాసం, సంకల్పం కారణంగా ఈ నిర్ణయాలు సాధ్యమయ్యాయి.. గుజరాత్‌లో సీఎంతో పాటు క్యాబినెట్ మొత్తాన్ని మార్చారు.. కొత్తదనాన్ని నింపాలనే ఉద్దేశంతో ఇలా జరిగింది.. ఫిర్యాదుల వల్ల కాదు’’ అని సంతోష్ పేర్కొన్నారు.రాజకీయాల్లో కూడా మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు. ‘రెండోసారి అధికారంలోకి రావడం అంత తేలికైన పని కాదు.. రెండోసారి ఎన్నికల్లో గెలవడం సవాల్‌ అని తెలుసు.. ప్రభుత్వ వ్యతిరేకత మరింత బలపడుతోంది’ అని సంతోష్ చెప్పారు. ఈయన వ్యాఖ్యలు కర్ణాటకలో మళ్లీ నాయకత్వ మార్పు అంటూ జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చుతున్నాయి.కాగా, యడ్డీని తప్పించి బొమ్మైకు బాధ్యతలు అప్పగించిన తర్వాత పార్టీ జాతీయ నాయకత్వం కర్ణాటక రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చలేదు. ఈ నేపథ్యంలో యడియూరప్ప కుమారుడు విజయేంద్రను క్యాబినెట్‌లో చేర్చుకోవద్దని, బొమ్మైను మార్చాలన్న చర్చ మొదలైంది. కర్ణాటకలో మార్పులు, చేర్పులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, దత్తాత్రేయ హొసబాళె, అరుణ్‌కుమార్‌లు సుదీర్ఘంగా చర్చించి, తీసుకోబోయే చర్యలపై ప్రధాని మోదీకి వివరించారు.కొందరు సీనియర్ల మాత్రం ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో విభిన్నమైన పరిస్థితులు ఉంటాయని, ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వాదిస్తున్నారు. ఈశ్వరప్ప రాజీనామాతో ఖాళీ అయిన మొత్తం ఐదు మంత్రి పదవులను భర్తీ చేస్తే సరిపోతుందని అంటున్నారు. మార్పులు, చేర్పుల పేరిట కొత్త వారికి అవకాశం కల్పిస్తే పాలనపై అది ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.కాగా, జాతీయ నేతలు చేసిన సిఫార్సులు, మోదీ తీసుకునే నిర్ణయం ఏంటనేది అమిత్‌ షా సమావేశం తర్వాతే సమాధానం లభించే అవకాశం ఉంది. కర్ణాటకలో హిజాబ్‌తో మొదలైన వివాదం తర్వాత హలాల్, అజాన్.. కాంట్రాక్టర్ ఆత్మహత్య వంటి ఘటనలు కర్ణాటకలో బీజేపీ సర్కారు ప్రతిష్ఠను కొంత దెబ్బతీశాయి.వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న కర్ణాటక ఎన్నికలకు మిషన్‌-150 నినాదంతో బీజేపీ సన్నాహాలు చేపట్టింది. పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసేందుకు అమిత్‌ షా వస్తున్నారు.

Related Posts