న్యూ డిల్లీ మే 3
మే 9వ తేదీలోగా ఉక్రెయిన్‌పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ చర్యలో భాగంగా రష్యా తన పూర్తి సైన్యాన్ని ఉక్రెయిన్ భూభాగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. మే 9వ తేదీన విక్టరీ డేను రష్యా జరుపుకుంటోంది. 1945లో ఆ రోజున నాజీలను రష్యా ఓడించింది. ఆ రోజున ఉక్రెయిన్‌లో సాధించిన సైనిక చర్య ఫలితాలను పుతిన్ వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దాడికి దిగిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నట్లు కానీ, ఆక్రమణకు వెళ్లినట్లు కానీ పుతిన్ అధికారికంగా చెప్పలేదు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ యూదుడు కావడం వల్ల.. ఆ దేశంపై డీనాజిఫికేషన్‌లో భాగంగా దాడి చేపట్టినట్లు కూడా పుతిన్ వెల్లడించిన విషయం తెలిసిందే. మే 9వ తేదీన పుతిన్ చేసే ప్రకటనతో ఆ దేశం తన రిజర్వ్ దళాలను యుద్ధ రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. అయితే గత రెండు నెలలుగా సాగుతున్న వార్‌లో ఇప్పటి వరకు పది వేల మంది రష్యా సైనికులు చనిపోయి ఉంటారని పశ్చిమ, ఉక్రెయిన్ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే.