పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశం ఇస్తూ గవర్నర్ వాజుభాయి తీసుకున్న నిర్ణయాన్ని డీఎంకే ముఖ్యనేత ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని స్టాలిన్ పేర్కొన్నారు.ఈ విధమైన నిర్ణయం బేరసారాలకు వీలు కల్పించడమమేనని ఆయన విమర్శించారు. ప్రజస్వామ్య పునాదులను ఇది కూల్చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా గవర్నర్‌తో ఆహ్వానం తెప్పించుకున్నారని దుయ్యబట్టారు. గవర్నర్‌ని ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆరోపించారు. గవర్నర్, ఆయన కార్యాలయాన్ని వాడుకుని ప్రధాని మోదీ తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో దేశం మొత్తానికి తెలుసునని, సభలో మెజారిటీ లేకపోయినా, అవినీతి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలు, విలువలు ప్రమాదంలో పడ్డాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా మోదీ అదే అమలు చేశారు. ఇది భారత రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అని స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడు,కర్ణాటక గవర్నర్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారా అని మీడియా అడగగా..ఇప్పటికే తమిళనాడులో అది చూశాం. ఇప్పుడు కర్ణాటకలో జరుగతున్నది కూడా అదే..అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. సభలో మెజారిటీ లేకపోయినా, అవినీతి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలు, విలువలు ప్రమాదంలో పడ్డాయని అభిప్రాయపడ్డారు.