విజయవాడ, మే 5,
రాష్ట్రంలో ఓ పక్క శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారై అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతుంటే.. మరో పక్క అత్యంత కీలకమైన విద్యాశాఖ మంత్రి ఉన్నట్టా లేనట్టా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అసలు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రేనా అని పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.ఏపీ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను గత మునిసిపల్ శాఖ నుంచి మార్చి విద్యాశాఖ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. తనకు ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చారని బొత్స అలిగారని చెబుతున్నారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగి పక్షం రోజులు గడుస్తున్నా.. ఆయన అలక వీడలేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. సీఎంను కలుద్దామన్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన అనంతరం ఇప్పటి వరకూ విద్యాశాఖకు సంబంధించి కనీసం నాలుగు సమీక్షలు జరిగాయి.. వాటి వేటికీ బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. ఈ మధ్య కాలంలో ఆయన అడపాదడపా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. ఏ సందర్భంలోనూ కూడా విద్యాశాఖకు సంబంధించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ క్వశ్చన్ పేపర్లు లీకౌతున్నాయి. అయినా బొత్స నోరు మెదపడం లేదు. ఆయన ప్రమేయం లేకుండానే టీచర్ల సస్పెన్షన్లు జరుగుతున్నాయి. ముందు ముందు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. వచ్చే నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. విద్యాశాఖకు అత్యంత కీలకమైన సమయం ఇది. ఇటువంటి సమయంలో ఆ శాఖ మంత్రి అంటీముట్టనట్టు వ్యవహరిస్తుంటే పరిస్థితి ఏమిటిఅయినా ఒక కీలక శాఖకు చెందిన మంత్రి ఇన్ని రోజులుగా పదవీ బాధ్యతలు చేపట్టకుండా తన నిరసన వ్యక్తం చేస్తుంటే సీఎం పట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. నిజంగానే ప్రభుత్వం దృష్టిలో విద్య అన్నది అప్రధాన్య అంశమా? విద్యార్థుల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో పాలన మరింత అస్తవ్యస్థమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవజ్ణులకు అప్రధాన్య శాఖలు, కొత్తవారికి కీలక శాఖలు అప్పగించిన ఫలితం పాలనపై ప్రస్ఫుటంగా కనిపిస్తున్నదని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఏ సమస్యపైనైనా స్పందించి ప్రభుత్వ వాదనను వినిపించే సీనియర్లు అలుకబూని మౌనంగా ఉండటంతో మొత్తం ప్రభుత్వంలోనే స్తబ్దత ఏర్పడిందని అంటున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని అంటున్నారు. ఏం ఉన్నా లేకపోయినా విపక్షంపై విరుచుకుపడుతూ విమర్శలు గుప్పించే కొడాలి నాని, పేర్ని నాని వంటి వారు మంత్రిపదవులు కోల్పోయి మౌనంతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే.. బొత్స వంటి వారు బాధ్యతలు చేపట్టకుండా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు రాజధానే కాదు..ప్రభుత్వమూ లేని రాష్ట్రంగా మారిపోయిందని పరిశీలకులు అంటున్నారు.