విజయనగరం, మే 5,
ఇన్నాళ్లూ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదన్నారు. కనీసం కార్యకర్తలనూ కలవలేదు. హైదరాబాద్‌లో సెటిలైపోదామని ఫిక్సైపోయారు. అధినేతకూ అదే చెప్పారు. కానీ, ఇప్పుడు సడన్‌గా యాక్టీవ్ అయ్యారు. రాజుగారమ్మాయిలో ఎందుకీ మార్పు? విజయనగరంలో ఆమె వ్యవహారశైలి దేనికి సంకేతం? విజయనగరం జిల్లాలో టీడీపీని తన కనుసన్నల్లో నడుపుతున్న సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు.. రాజకీయంగా బలమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన ఆయన రాష్ట్ర, కేంద్ర మంత్రివర్గాల్లో పనిచేశారు. 2014 ఎన్నికల్లో విజయనగరం ఎంపీ గా గెలిచి కేంద్ర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఎన్నికల్లో ఆయన రెగ్యులర్ స్థానమైన విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్‌లో మీసాల గీత ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, 2019 ఎన్నికల్లో మీసాల గీత స్థానంలో అశోక్ వారసురాలు అదితి గజపతికి టీడీపీ అవకాశం ఇచ్చింది. అశోక్‌ను మళ్లీ విజయనగరం ఎంపీగా నిలబెట్టింది. అయితే, ఫలితం నిరాశపరిచింది. వైసీపీ వేవ్‌లో ఎంపీగా అశోక్ గెలవలేదు. ఎమ్మెల్యేగా ఆయన కూతురూ విజయం సాధించలేదు.వైసీపీ అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతిని సమస్యలు చుట్టుముట్టాయి. మాన్సాస్ వివాదం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. కోర్టు తీర్పు తర్వాత మళ్లీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకున్నా అధికార పార్టీ తీరుతో సతమతమయ్యారు. వయోభారం కారణంగా ప్రతిపక్ష పాత్రను కూడా యాక్టీవ్‌గా పోషించలేకపోతున్నారు. ఆయన కుమార్తె అదితి గజపతి కూడా కొన్నాళ్లు పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నా ఆర్నెళ్లుగా దూరంగా ఉంటున్నారు. కార్యకర్తల్ని కలవట్లేదు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఎన్ని మెసేజ్‌లు పెట్టినా స్పందించడం లేదు. తాను, రాజకీయాలు పట్టించుకోవడం లేదని, ఏదైనా ఉంటే తన తండ్రి అశోక్ గజపతితో మాట్లాడాలని చెప్పేశారని టాక్. నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న అదితి వ్యవహారం కార్యకర్తలను అయోమయంలో పడేసింది.రాష్ట్రమంతా టీడీపీ కమిటీలు వేస్తే ఈ నియోజకవర్గంలో మాత్రం ఆ ఊసేలేదు. ఓ వైపు అధికార పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల ప్రజల్లోకి దూసుకుపోతుంటే టీడీపీలో మాత్రం నిస్తేజం కనిపిస్తోంది. విషయం తెలుసుకున్న చంద్రబాబు నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో లోకల్ నేతలంతా హాజరైనా అశోక్ గజపతి, అదితి గజపతిలతో చంద్రబాబు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. తనకు రాజకీయాలు ఆసక్తి లేదని, హైదరాబాద్‌లో సెటిలవ్వాలనుకుంటున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆదితి చెప్పినట్టు సమాచారం. అయితే, ఒక్కసారిగా షాకైన చంద్రబాబు మరోసారి ఆలోచించుకోవాలని సూచించారట. కుటుంబ చరిత్రను, కీర్తిని ముందుకు తీసుకుకెళ్లాల్సిన బాధ్యతను గుర్తు చేశారట. అందుకోసమైనా రాజకీయాల్లో ఉండాలని అదితికి నచ్చజెప్పారని సమాచారం.నియోజకవర్గ కమిటీలు వేసి ఆర్నెళ్లలో పార్టీని బలోపేతం చేయాలని అదితిని చంద్రబాబు ఆదేశించారని తెలుస్తోంది. అశోక్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి.. కొన్నాళ్లు ఆయనకు అండగా ఉండి క్యాడర్ ను ముందుకు తీసుకెళ్లాలని హితబోధ చేశారట. ఆ తర్వాత కూడా నిర్ణయంలో మార్పు లేకుంటే అప్పుడు ఆలోచిద్దామన్నారట చంద్రబాబు. మీటింగ్ తర్వాత విజయనగరం చేరుకున్న అదితి.. పార్టీలో యాక్టీవ్ అయ్యారు. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న అదితి గజపతి… సడన్ గా యాక్టీవ్ కావడం పార్టీ శ్రేణుల్ని ఆనందపరుస్తోంది. ఆశ్చర్యపరుస్తోంది. కాకపోతే, ఈ యాక్టివ్‌నెస్‌ని కంటిన్యూ చేస్తారా? లేక మరో ఆర్నెళ్లు కాగానే ఇంట్రెస్ట్ లేదంటూ తప్పుకుంటారా? అనే అనుమానమూ వెంటాడుతోంది.