ముంబై,మే 5,
బంగారం కొనుగోలు విషయంలో మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లు నిరాశపర్చిన అక్షయ తృతీయ అమ్మకాలు.. ఈ సంవత్సరం జోరుగా కొనసాగాయి. ఇక అక్షయ తృతీయను పురస్కరించుకుని మంగళవారం ఉదయం నుంచే నగల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడాయి. ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్ట్యా కొనుగోలుదారుల సౌకర్యార్థం చాలామంది వ్యాపారులు తమ షోరూంలను త్వరగానే ఓపెన్ చేశారు. ఉదయం పూట అమ్మకాలు జోరుగా కొనసాగినా.. ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్నం సమయంలో కొంత నెమ్మదించింది. రాత్రి సయయంలో కొనుగోళ్లు జోరందుకున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. కోవిడ్‌కు ముందు కంటే ఈ సారి 25 నుంచి 30 శాతం కొనుగోళ్లు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.గతంలో పోల్చినట్లయితే ఈ సారి 10 శాతం పసిడి అమ్మకాలు పెరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈసారి రూ.15,000 కోట్ల విలువైన వ్యాపారం జరిగి ఉండవచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్యఅంచనా వేసింది. చివరిసారిగా 2019లో రూ.10,000 కోట్ల విక్రయాలు జరుగగా, 2019లో అక్షయ తృతీయ రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి విలువ రూ.35, 220గా ఉంటే, ఈసారి రూ.51,510కు చేరుకుంది. అలాగే మార్చి నుంచి గమనిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.5వేల వరకు తగ్గుముఖం పట్టింది. ఇది కూడా కొనుగోలు పెంచేందుకు దోహదపడినట్లు మార్గెట్ నిపుణులు చెబుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 25-30 టన్నుల పసిడి అమ్మకాలు జరిగాయని అంచనా వేస్తున్నామని అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి వైస్ చైర్మన్ శ్యామ్ మెహ్రా తెలిపారు. 10 గ్రాముల బంగారం ధర రూ.55,000-58,000ల నుంచి రూ.50,500 స్థాయికి తగ్గడం కూడా అమ్మకాల పెరుగుదలకు మంచి అవకాశమని చెబుతున్నారు. అయితే ఈసారి మాత్రం అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు బాగానే ఉన్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదమని భావించే వినియోగదారుల కోసం పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించాయి పలు జ్యూలరీ షాపులు. నగల కొనుగోళ్లపై డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లను కల్పించాయి. అలాగే కొనుగోళ్లపై లక్కీ డ్రాలు కూడా తీశారు. గెలుపొందిన వారికి స్మార్ట్‌ఫోన్లు, వెండి కాయిన్స్, ఎయిర్ కూలర్లు, ఇతర గృహోపకరణ వస్తువులను బహుమతులుగా అందించారు. ఇక తమ యాప్‌లు, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్లు ప్రకటించారు.