YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

మాకూ పెట్టుబడికి చేయూతనివ్వండి

మాకూ పెట్టుబడికి చేయూతనివ్వండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేలం పాట ద్వారా ఆలయ భూములను దక్కించుకుని సాగు చేస్తున్నారు నిరుపేద రైతులు. నీటి వసతి లేకున్నా వర్షాధారంగా పంటలు వేసి ఏళ్లుగా దేవస్థానం భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందకుండా పోయిందని సమాచారం. దేవుడి పేరుమీద పట్టా, కాస్తు కాలంలో తామున్నా రైతుబంధు పథకం తమకు వర్తించే అవకాశం తమకు లేకుండా పోతోందని పలువురు బడుగురైతులు నిరుత్సాహపడుతున్నారు. తమకూ ఈ పథకం ఫలం దక్కేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు. రాజన్న సిరిసిల్లాలోనే కాక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఉమ్మడిజిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో 320 ఆలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 3223.26 ఎకరాల భూమి ఉంది. వేల మంది కౌలు రైతులు ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాది, రెండేళ్ల కోసారి దేవాదాయశాఖ నిర్వహించే వేలంపాటలో భూమిని దక్కించుకుని సాగు చేసుకుంటున్నారు. తరాలుగా ఆలయం ఉత్సవాల్లో సేవలు చేసే వృత్తి కుటుంబాలు, గుడి భూములను ఆనుకుని ఉన్న రైతులు సాగు చేసుకుంటూ కుటుంబాలు గడుపుతున్నారు. పట్టాదారు కాలంలో ఆలయంలో కొలువైన స్వామి పేరు ఉంటుండగా, అనుభవదారు కాలంలో కౌలు చేసే రైతుల పేర్లు నమోదు చేస్తున్నారు.

 

ఆలయ భూములు ఎక్కువగా ఒకప్పుడు దాతలు విరాళంగా ఇచ్చినవి కాగా మిగతావి ఆలయ నిర్మాణ కాలం నుంచి దేవుని పేరు మీద చలామణిలో ఉన్నాయి. ప్రస్తుతం కౌలు రూ.8 వేల నుంచి రూ.10 వేలకు లభిస్తోంది. అయితే సాగుకు నిరుపయోగమైన భూములను కూడా రైతులు సాగు కోసం అనువుగా మలిచారు. ఈ భూములపై ఆదాయం వస్తున్నా దేవాదాయశాఖ మాత్రం వసతుల కల్పనపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఒక్క చోట కూడా నీటి ఆధారం లేదు. దీంతో కొందరు రైతులు పక్కనే ఉన్న సాగునీటి బావులను ఆధారం చేసుకున్నారు. మరికొందరు వర్షాలపై ఆధారపడి పంటలు వేస్తున్నారు. నీటి సౌకర్యం లేక వరణుడి పై భారం వేసి సాగు చేసిన పంటలు చేతికి వచ్చే వరకు భరోసా ఉండడంలేదు. కొందరు రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో మాత్రమే సాగు చేసి సాగు నీరు లేక రబీలో వదిలేస్తున్నారు. ఫలితంగా కౌలు రైతులు అప్పుల పాలవుతున్న దుస్థితి. ఈ సమస్యలన్నింటినీ గుర్తించి తమకూ రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

Related Posts