తిరుమల, మే 05,
శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించి, ఈ మార్గంలో భక్తులను తిరుమల కు అనుమతించారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది నవంబరు 18, 19వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గంలో పెద్ద బండరాళ్ళు పడి రోడ్డు, మెట్లు, ఫుట్‌పాత్‌లు, మరుగుదొడ్లు దెబ్బతిన్నాయన్నారు. ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన నడక మార్గాన్ని రూ.3.60 కోట్లతో మరమ్మత్తు పనులు పూర్తి చేశారని చెప్పారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో శ్రీవారి మెట్టు మార్గంలో మరమ్మత్తులు పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది కాంట్రాక్టర్లను చైర్మన్ అభినందించారు. ఈ మార్గం గుండా ప్రతి రోజు ఆరు వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తు శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్లు , శ్రీ కృష్ణదేవరాయులు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని వివరించారు.
ఇంజినీరింగ్, కాంట్రాక్టర్లకు సన్మానం :
అనంతరం శ్రీవారి మెట్టు నడక మార్గంలో త్వరితగతిన మరమ్మత్తులు పూర్తి చేసిన సిఇ నాగేశ్వరరావు, ఎస్ఇ - 2 జగదీశ్వర్ రెడ్డి, ఇఇ సురేంద్రరెడ్డి, ఈరోడ్కు చెందిన ఆర్ఆర్ బిల్డర్స్ డిజిఎమ్ ఆర్ముగంను చైర్మన్ శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎం.ఎల్.ఏ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోర్డు సభ్యులు పోకల ఆశోక్ కుమార్, మొరం శెట్టి రాములు, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, శ్రీనివాసమంగాపురం ఆలయ డెప్యూటీ ఈవో వరలక్ష్మీ, డిఇ రవిశంకర్ రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.