అమరావతి మే 5
రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌లు చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తికి చెందిన నారాయణ, శ్రీచైతన్య కళాశాలల నుంచే అవుతున్నాయని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఓర్వలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.జగనన్న విద్యాదివేన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 10 లక్షల 85 వేల మంది విద్యార్థులకు రూ. 709 కోట్లను సీఎం ఇవాళ తిరుపతిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు హయాంలో విద్యార్థుల గురించి ఏనాడు పట్టించుకోలేదని, తాము నాడు-నేడు ద్వారా పలు పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. టీడీపీ హయాంలో విద్యార్థులకు అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.రాష్ట్రంలో గవర్నమెంట్ బడులు మూసివేయాలన్నదే చంద్రబాబు ఆలోచన అని దుయ్యబట్టారు. క్రమం తప్పకుండా విద్యార్థులకు వసతి దీవెనను అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30వేల మంది నిరుద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అసంపూర్తిగా మిగిల్చిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి అక్క చెల్లెమ్మలకు అందజేస్తున్నామని అన్నారు. చంద్రబాబు పాలనను, తమ పాలనను భేరిజు వేసుకోవాలని ప్రజలను కోరారు.