YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నగదు కొరత..వృద్ధుల వేదన

 నగదు కొరత..వృద్ధుల వేదన

కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ఆసరాగా నిలవాలని ప్రభుత్వం నెలకు రూ.వేయి అందిస్తోంది. అయితే ఈ సాయం లబ్ధిదారులకు మాత్రం చేరడం లేదని వనపర్తి జిల్లాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నగదు కొరత కారణంగా లబ్ధిదారులకు సొమ్ము అందడంలేదని తెలుస్తోంది. దీంతో వృద్ధులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఈ సమస్య ఇప్పుడు ఉన్నదికాదు. దాదాపు ఆరు నెలలుగా ఇదే పరిస్థితి అని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతి నెలా డబ్బు వెనక్కి వెళ్లడం.. తరవాత నెలలో పంపిణీ చేయడం.. ఆ నెలలో అదే పరిస్థితి ఎదురుకావడం ఆసరా లబ్ధిదారులను నిరాశపరుస్తోంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన  పింఛన్లను పంచడానికి ఈ నెల 15న సాయంత్రంతో గడువు ముగిసింది. ఇందులో బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారిలో 99 శాతం మంది పెన్షన్ అందుకోగలిగారు. ఇక ఖాతాలు లేనివారికి తపాలా శాఖ ద్వారా బయోమెట్రిక్‌ యంత్రంతో గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. అయితే బ్యాంకుల నుంచి ఒకేసారి రూ.లక్షల్లో నగదు ఇవ్వకపోవడంతో పంపిణీ చేయలేకపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా, శాశ్వతంగా వలస పోయిన వారు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చి ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు. 

వెనకబడిన ఉమ్మడి జిల్లా నుంచి పలువురు జీవనోపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. ఒక నెలకు వచ్చే రూ.1000, రూ.1500లు రాకపోకలకు సరిపోతుందని భావించి ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు కొందరు. ఇలాంటి వారు మూడో నెలలో డబ్బులు తీసుకోని పరిస్థితి ఎదురైతే వారికి నాలుగో నెలలో పింఛను మంజూరు కావడంలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వరుసగా మూడు నెలలు పింఛను తీసుకోకుంటే నాలుగో నెల నుంచి పింఛను నిలిపివేస్తారు. అయితే నగదు కొరత వల్ల కొన్ని నెలలుగా పింఛన్ అందడంలేదు. దీంతో నిబంధనల ప్రకారం ఆసరా సాయం నిలిచిపోతుందేమోనని లబ్ధిదారులు ఆందోళలో కూరుకుపోయారు. నగదు కొరత వల్ల పింఛన్లు పంచడంలో సమస్య ఉత్పన్నమవుతోంది వాస్తవమే అని సంబంధిత అధికార యంత్రాంగం కూడా చెప్తోంది. ఈ సమస్యపై బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా పరిష్కారం కావడం లేదు అంటోంది. వచ్చే నెల నుంచి ఈ సమస్య రాకుండా చూస్తామని లబ్ధిదారులందరికీ పింఛన్లు దక్కేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.  

Related Posts