విజయవాడ, మే 5,
తెలుగు రాష్ట్రాలలో రాజకీయం సెగలు కక్కుతూ రగులుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో పార్టీల నేతలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. రాజకీయ హడావుడి మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అక్కడ ఏమైనా ఎన్నికలు జరుగుతున్నాయా అనిపించేలా ఉంది. ఈ పరిస్థితిపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పొలిటికల్ టూరిజం స్పాట్ ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలకూ అతికినట్టుగా సరిపోతుంది. తెలంగాణలో మరో ఏడాదికిముందే ఎన్నికల వేడి రగులుకుంటే.. ఎపిలో రెండేళ్లకు ముందే రాజకీయ సెగలు రగులుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు తోడు వైఎస్ షర్మిల పాదయాత్రలతో బిజిగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలలాగే షర్మిల విమర్శల టార్గెట్ కూడా తెరాసాయె. బిఎస్పిలో చేరిన మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అధికార పార్టీపై విమర్శల వాగ్బాణాలతో రాజకీయ వేడి రగిలేందుకు తన వంతు శ్రమ పడుతున్నారు. రాష్ట్రంలో ఇక సెలబ్రిటీల పర్యటనలు జోరందుకుంటున్నాయి. బిజెపి అధ్యక్షుడు నడ్డా కూడా ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రెండ్రోజుల పర్యటనకు తెలంగాణకు వస్తున్నారు. శుక్రవారం వరంగల్ సభతో పాటు, శనివారం హైదరాబాద్ లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాహుల్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సన్నాహక సభలూ, సమావేశాలతో క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపింది. చాలా రోజుల తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో సమరోత్సాహం కనిపిస్తున్నదని పరిశీలకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పాదయాత్రతో ప్రజల దగ్గరకు వెళ్లారు. పార్టీ నేతలు కూడా విభేదాలు మరచి ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. రాహుల్ పర్యటన తరువాత ఈ ఐక్యత ఎంతవరకు అన్నది పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా సమష్టితత్వం కనిపిస్తున్నది. హోం మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ పర్యటనకు త్వరలో రానున్నారు. మండుటెండల్లో రాజకీయ యాత్రలతో పొలిటికల్ హీట్ను మరింతగా పెంచేస్తున్నారు. ఆంధ్రలో కూడా ఇదే పరిస్థితి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. అధికార, విపక్షాలలో ఎన్నికల రష్ పెరిగిపోయింది. విపక్షాలను చిత్తు చేయాలని అధికార పక్షాలు, అధికార పక్షంలోకి రావాలని విపక్షాలు ఇదే మంచి తరుణం...మించితే మరి దొరకదు అన్న లెవెల్లో హడావుడి చేసేస్తున్నాయి. వైకాపా వైఫల్యాలపై తెలుగుదేశం దూకుడు అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. రెండేళ్లకు ముందే ఎపిలో విపక్ష టిడిపి సమరశంఖం పూరించేసింది. బాదుడే బాదుడు నినాదంలో ప్రజలలోకి వచ్చేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలతో ఎన్నికల ప్రచార శంఖారావం మోగించేశారు. కార్యకర్తల్లో భరోసా నింపేందుకు అధినేత చంద్రబాబు ఎన్నికల వార్ ప్రకటించారు. ఆయన ప్రసంగాలకు వస్తున్న ప్రజా స్పందన తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహాన్నినింపుతుంటే.. అధికార వైసీపీ క్యాడర్ లో నిరుత్సాహం గూడుకట్టుకుంటోంది.