YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రెండు నెలల్లో 4.77 లక్షల టన్నులే సేకరణ

రెండు నెలల్లో 4.77 లక్షల టన్నులే సేకరణ

విజయవాడ, మే 5,
రాష్ట్ర వ్యాప్తంగా రబీ ధాన్యం సేకరణ నత్తనడకన కొనసాగుతోంది. ధాన్యం సేకరణ ప్రారంభించి రెండు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు 4.77 లక్షల టన్నులే ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వం సేకరించింది. దీని మొత్తం విలువ రూ.933.39 కోట్లు. రాష్ట్రంలో 221 మండలాల్లో, 1,701 ఆర్‌బికె సెంటర్లు ధాన్యం సేకరణ చేపట్టాయి. అయినప్పటికీ ధాన్యం సేకరణ ఊపందుకోవడం లేదు. ఆర్‌బికె అధికారులు, పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇ-క్రాప్‌లో పంట నమోదు చేసుకున్న రైతులను అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మిల్లర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న మిల్లర్లు రైతులను ఇష్టారీతిన దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మౌనం పాటిస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ ద్వారంపూడి భాస్కరరెడ్డి మిల్లర్లకు పెద్దదిక్కుగా ఉండడంతో వారు చెలరేగిపోతున్నా.. అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని రైతులే చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించుకున్న 50 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ సేకరించలేకపోయింది. రబీ ధాన్యం సేకరణ కూడా ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం 45లక్షల టన్నులు సేకరిస్తుందా, లేదా అనేది ఒక ప్రశ్న.రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌ ధాన్యానికి రూ.1,960 మద్దతు ధర ఇస్తున్నా... రైతుల నుంచి ఆర్‌బికె అధికారులు ధాన్యం సేకరించడంలో చొరవ చూపడం లేదు. దీనికి గల కారణం మిల్లర్లు ఆర్‌బికె అధికారులను డబ్బు, ఇతర రూపాల్లో ప్రలోభాలకు గురిచేస్తున్నారని సమాచారం. దీనివల్ల ఆర్‌బికె అధికారులు రైతులు తెచ్చిన ధాన్యానికి వంకలు పెట్టడంతో రైతులు మంచి ధర ఇచ్చేవారి కోసం ఎదురుచూస్తున్నారు. అటువంటి సమయంలో రైతులను మిల్లర్లు తమవైపు తిప్పుకుని, మద్దతు ధర ఇవ్వకుండా, క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.200 తగ్గించి ఇస్తున్నారు.రైతుల నుంచి ధాన్యం సేకరించిన ప్రభుత్వం ఆ డబ్బులను రైతుకు 21 రోజులు పూర్తయిన తర్వాత ఖాతాల్లోకి జమ చేస్తోంది. అధిక సందర్భాల్లో 21 రోజులు గడిచిన వెంటనే ఇచ్చిన దాఖలాలు తక్కువే. రెండు నుంచి మూడు నెలల సమయం గడిచినా డబ్బులు అందని పరిస్థితులూ పౌరసరఫరాలశాఖలో లేకపోలేదు. ఈ తంతు ఖరీఫ్‌ సీజన్‌లో జరిగింది. దీంతో రైతులు తమ అత్యవసరాలకు డబ్బులు సకాలంలో అందడం లేదని, మిల్లర్లకు ధాన్యం ఇచ్చే పరిస్థితి వస్తోంది. అనివార్యంగా రైతు దోపిడీకి గురవుతున్నాడు.

Related Posts