విజయవాడ, మే 5,
విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులను పలు పరిశ్రమలు చెల్లించడం లేదు. అవి నడిచేందుకు అవసరమైన విద్యుత్‌ను వాడుకొని బిల్లు ఎగవేతదారులుగా మిగిలారు. ఏడేళ్ల నుంచి రూ.కోట్లు చెల్లించకుండా తప్పించుకున్నాయి. మొత్తం మూడు డిస్కమ్‌ల పరిధిలో సుమారు రూ.508 కోట్ల బకాయిలు పరిశ్రమల నుంచి రావాల్సి ఉంది. ఈ బిల్లులకు సంబంధించిన అంశాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటుకు మూడు డిస్కమ్‌లు అప్పగించాయి. వీటిపై విచారణ జరిపించాలని ఫిబ్రవరిలో కోరాయి. దీనిపై స్పందించిన విజిలెన్స్ బిల్లుల వసూలుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఇంధనశాఖకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు చెప్పినట్లు ఇంధనశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం మూడు డిస్కమ్‌ల పరిధిలో 1130 పరిశ్రమల నుంచి రూ.508 కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయి. ఇందులో 87 పరిశ్రమలకు సంబంధించిన బకాయిలు రూ.147 కోట్ల చెల్లింపులపై కోర్టు వివాదాల్లో ఉన్నాయి. దీంతో మిగిలిన రూ.360 కోట్ల వసూళ్లపై డిస్కమ్‌ల వారీ ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇపిడిసిఎల్ పరిధిలో రూ.77 కోట్లు, సిపిడిసిఎల్ పరిధిలో రూ.76 కోట్లు, ఎస్‌పిడిసిఎల్ పరిధిలో రూ.206 కోట్లు చొప్పున బకాయిలు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బిల్లు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ తెలిపినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు, సౌకర్యాలు, ఇతర పథకాలను బిల్లు ఎగవేతదారులకు నిలుపుదల చేయాలని ప్రతిపాదించినట్లు విజిలెన్స్ తెలిపింది. కోర్టు వివాదంలో ఉన్న రూ.147 కోట్లను రాబట్టేలా న్యాయ సలహాలు తీసుకోవాలని పేర్కొంది.