YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నానికి ఇంటి పోరు

నానికి ఇంటి పోరు

విజయవాడ, మే 5,
పేర్ని నాని.. ఏపీలో తాజా మాజీ మంత్రి.. రవాణా, సమాచార శాఖలు నిర్వహించారు.మూడేళ్లు మంత్రి పదవిని అనుభవించారు. సీఎం జగన్ కోరిక మేరకు ఒక్కసారిగా మాజీగా మారిపోయారు. మంత్రి పదవిలో ఉన్నంత కాలం నానిలో మంచి చమత్కారే కనిపించాడు. మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు కాస్త వాస్తవాన్నీ.. మరికాస్త వ్యంగ్యాన్ని జోడించి జవాబులిచ్చేవారు. అయితే.. చేతిలో పవర్ పోవడంతో ఆయన ఇప్పుడు కోరలు పీకేసిన పాము మాదిరిగా అయిపోయారంటున్నారు. తనను పదవి నుంచి పీకేయడంతో పేర్ని నాని అలిగిన వైనం స్పష్టంగా బయటపడకపోయినా.. మౌనం అయితే వహించిన దాఖలాలే కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన నియోజకవర్గానికి వస్తే.. పేర్ని నాని ఆయన పర్యటన దరిదాపుల్లోకి రాకపోవడం అందరి దృష్టికీ వచ్చింది.పేర్ని నాని తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా మచిలీపట్నంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ విఫ్ గా పనిచేశారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పేర్ని నాని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో 16 వేలకు పైబడి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో నానికి 59 వేల 403 ఓట్లు పోలయ్యాయి. ఇక 2019 ఎన్నికలు వచ్చే సరికి పేర్ని నాని మళ్లీ పుంజుకుని మచిలీపట్నం నుంచే సుమారు 6 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పైనే గెలిచారు. అప్పుడాయనకు 66 వేల 141 ఓట్లు వచ్చాయిపేర్ని నాని మంత్రి పదవిలో ఉన్నప్పుడు తన సామాజికవర్గానికే చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బాగా విరుచుకుపడేవారు. పవన్ కళ్యాణ్ ను పార్ట్ టైం పొలిటీషియన్ అని.. బీజేపీని ప్రేమిస్తూ.. చంద్రబాబుకు కన్నుకొడుతున్నారంటూ.. పవన్ మాటలు మారుస్తారని, నిలకడ లేని రాజకీయ నేత అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చిన పవన్ కళ్యాణ్ బీజేపీ చంక ఎక్కారని ఘాటు విమర్శలు చేశారు. అలాగే ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న టీడీపీ పైనా పేర్ని నాని ఒంటికాలిపై లేచి మరీ విమర్శలు గుప్పించారు.మచిలీపట్నం నియోజకవర్గం ఓటర్లలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. పేర్ని నాని సామాజికవర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. కొన్ని గ్రామాల్లో అయితే.. కాపులదే పైచేయి. అయితే.. పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్ల కారణంగా ఆ సామాజికవర్గం ఓటర్లు పేర్ని నానిపై ఈ సారి బాగా గుర్రుగా ఉన్నారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక పేర్ని నానికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వారు తెగేసి చెబుతున్నారట. ఇక మచిలీపట్నంలో నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టు ఉంది. టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గతంలో మంచి మెజార్టీతోనే నెగ్గారు. ఈ సారి మళ్లీ మచిలీపట్నంలో టీడీపీకే మెజార్టీ ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఒక పక్కన పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా కామెంట్లు చేయడం, మరో పక్కన ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల సంఖ్యలో బీసీ సామాజికవర్గాలు ఉండడం కూడా పేర్ని నానికి ఈ సారి విజయావకాశాలు తగ్గిపోయే చాన్స్ ఉందంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి పేర్ని నాని చేసిందేమీ లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు పేర్ని నాని, కొడాలి నాని ఇసుక లారీలు యధేచ్ఛగా తిరిగాయని, వారిద్దరూ ఇసుక దోపిడీ చేశారని స్థానికంగా చెబుతున్నారు. మచిలీపట్నం చుట్టుకప్కల తోడేసిన ఇసుకను హైదరాబాద్ వరకు తరలించుకుపోయేవారనే విమర్శలు ఉన్నాయి. పేర్ని నాని మంత్రి అయిన తర్వాత సొంత ఆస్తులు బాగా కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.దానికి తోడు జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ ఆర్థికంగా దిగజారిపోవడం, అభివృద్ధి జాడే లేకపోవడం, ఓటర్లకు కావాల్సిన కనీస అవసరాలు కూడా కల్పించలేక చతికిలపడిపోయిన వైసీపీకి వ్యతిరేకత పెరిగిపోతుండడం కూడా పేర్ని నానికి చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశం ఉందంటున్నారు. వీటితో పాటు మచిలీపట్నం నియోజకవర్గంలో సమస్యలు కూడా మూడేళ్లు మంత్రిగా పనిచేసిన పేర్ని నాని అంతగా పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి.మొత్తం మీద ఎన్నో వ్యతిరేకతలను నెత్తిన మూటకట్టుకున్న పేర్ని నానికి ఈ సారి మచిలీపట్నం నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Posts