ఖమ్మం జిల్లాలో సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల ద్వారా ఆహార పంటల సేకరణ పెద్దమొత్తంలో జరిగింది. మొక్కజొన్న, ధాన్యాలను పెద్దమొత్తంలో సేకరించారు. అనేక సమస్యలున్నా అంచనాకు మించి కొనుగోళ్లు సాగాయి. దీంతో సమస్యలను పరిష్కరించి.. సహకార సంఘాలను బలోపేతం చేయాలని అంతా కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు పేరిట రూ.142 కోట్ల వ్యాపారం చేశాయి. వ్యాపారం పెద్దఎత్తున సాగడంతో ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఏర్పడింది. ఇక జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్ల పరిధిలోని సహకార సంఘాల ద్వారా 20,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు సేకరించారు. ఈ కొనుగోళ్ల ద్వారా రూ.30కోట్ల వ్యాపారం సాగింది. ధాన్యం, మొక్కజొన్నలు కలిపి సంఘాలు రూ.142కోట్ల వ్యాపారం చేశాయి. ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. ధాన్యాన్ని సేకరించి సివిల్ సప్లయ్స్ అధికారులకు, మొక్కజొన్నలను సేకరించి మార్క్‌ఫెడ్ అధికారులకు సహకార సంఘాలు అప్పగిస్తాయి. ఇందుకు ధాన్యం క్వింటాకు రూ.33ల చొప్పున, మొక్కజొన్నలకు క్వింటాకు రూ.11ల చొప్పున కమీషన్ రూపంలో సంఘాలకు లభిస్తుంది. ఇలా ఒక్కో సహకార సంఘానికి రూ.లక్షల్లో కమీషన్ అందనుంది. ఫలితంగా సంఘాలు నష్టాల నుంచి బయటపడతాయి.
దళారుల ప్రమేయం లేకుండా సహకార సంఘాలు ధాన్యాన్ని, మొక్కజొన్నలను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఇలా పంటను సేకరిస్తూ ప్రభుత్వానికి-రైతులకు మధ్యవర్తిగా వ్యహరిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు చొరవచూపి రికార్డు స్థాయిలో ధాన్యం, మొక్కజొన్న దిగుబడులను కొనుగోలు చేశాయి. దళారీ వ్యవస్థలకు సమర్ధవంతంగాఅడ్డుకట్ట వేశాయి. ప్రస్తుతం ధ్యానం సేకరణ జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు పూర్తి కావచ్చింది. 17కేంద్రాల ద్వారా మొక్కజొన్నలను కూడా అతి తక్కువ సమయంలో ఎక్కువగా కొనుగోలు చేసి ప్రశంసలు దక్కించుకున్నాయి సంఘాలు. అయితే సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు ఉండడంలేదు. దీంతో రైతులకు సమస్యలు ఏర్పడుతున్నాయి. పలు సంఘాల వద్ద పంటను కాపాడుకునేందుకు రక్షణ పట్టాలు ఉండడంలేదు. దీంతో ఇటీవలి అకాల వర్షాలకు కేంద్రాల్లోనే ధాన్యం తడసిపోయింది. కేంద్రాలకు వచ్చే రైతులకు కూడా అక్కడ కనీస సౌకర్యాలు లేవు. టెంట్లు లేవు. తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలు కరవయ్యాయి. బస్తాలు సకాలంలో రావటం లేవు. కొనుగోలు కేంద్రాల నుంచి గోడౌన్లకు పంట చేరడంలోనూ కొంత ఆలస్యమవుతోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తే సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని అంతా అభిప్రాయపడుతున్నారు.