YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ

పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ

దశాబ్దకాలంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. భూతాపం కూడా తీవ్రమైంది. ఫలితంగా జీవరాశిపై దుష్ప్రభావాలు పడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే మొక్కలు పెంచడం, చెట్లను కాపాడుకోవడం ఒక్కటే మార్గం. ఈ విషయం తెలిసీ కొందరు డబ్బు కోసం ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని చెట్లను నరికేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలోని పలుచోట్ల వృక్షాలను కొందరు ఇలాగే ధ్వంసం చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. కొంతకాలంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా దుండగుల్లో మార్పు ఉండడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జగిత్యాల జిల్లాకే ఈ దందా పరిమితంకాలేదు. ఉమ్మడి జిల్లా అంతటా కొందరు చెట్లు నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు స్పష్టంచేస్తున్నారు. అటవీ సిబ్బంది ఉదాసీన, బాధ్యులపై కఠిన చర్యలు లేకపోవడంతో ఈ దందా యథేచ్ఛగా సాగిపోతోందని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో అడవుల విస్తీర్ణం 2,50,410 హెక్టార్లు. అయితే ఇందులో కనీసం 25 శాతం వరకు చెట్లులేని అటవీభూమి ఉందని సమచారం. అడవుల్లో చెట్లు భారీగా నరికివేతకు గురవుతుండటంతో స్థానికంగా పర్యావరణం ప్రభావితమవుతోంది. కేవలం సారంగాపూర్‌ మండలంలోనే నాలుగు వేల ఎకరాల అటవీభూమిలో చెట్లను నరికి ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 

2010 సంవత్సరం నుంచి ఆటోమెటిక్‌ వెదర్‌ స్టేషన్లలో నమోదు చేసిన గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని తొలి పదింటిలో మొదటి ఆరు స్థానాలు ఉమ్మడి జిల్లాలోనివే. అప్పుడే జిల్లాలో విస్తృతస్థాయిలో పచ్చదనం పరచుకునే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వచ్చింది. అయితే కాసుల కోసం పలువురు అక్రమార్కులు అటవీ ప్రాంతాల్లో విధ్వంసం కొనసాగిస్తున్నారు. ఫలితంగా భారీ వృక్షాలు కనుమరుగవుతున్న దుస్థితి. ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 3 లక్షల వరకు వాహనాలుండగా ప్రతినెలలోనూ వందలసంఖ్యలో నూతన వాహనాలు వీటికి జతవుతున్నాయి. వాహనాల నుంచి వచ్చే కార్బన్‌ మోనాక్సైడ్‌ను చెట్లు చాలావరకు తగ్గిస్తాయి. కానీ చెట్లు లేనందున సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు నేలనుతాకి కర్బన ఉద్గారాలతో మిళితమై భూమిపై విపరీతమైన వేడికి కారణమవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో సగటు వర్షపాతం కూడా తగ్గుతోంది. దీంతో పంటలసాగుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దిగుబడులు తగ్గిపోవడంతో ఆహారకొరత సమస్య తలెత్తుతోంది. మరోవైపు బోర్లను అధికంగా వేస్తున్నందున నేల పైపొరల్లోని నీరు అడుగుకు వెళ్లి నేల త్వరగా వేడెక్కుతోంది. అడవుల విధ్వంసం వల్ల పర్యావరణంపై దుష్ప్రభావాలు అధికంగా ఉంటున్నాయి. అందుకే అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

Related Posts