అమరావతి మే 6
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందని, అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. కాకినాడ జిల్లాలోని తుని, ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రజా ఉద్యమం రావాలని అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ధరల పెంపు, పన్నుల పెంపుతో ప్రజలపై ప్రభుత్వం బాదుడే బాదుడు చేస్తుందని విమర్శించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వెల్లడించారు. టీడీపీ నాయకులను అరెస్టు చేస్తే మీ మీదున్న వ్యతిరేకత తగ్గుతుందా అని ప్రశ్నించారు. కేసులు పెడితే ఎవరూ భయపడేవారు లేరని అన్నారు. వ్యక్తిగతంగా తమకు ఎవరిపై కోపం లేదని, ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఆడబిడ్డలపై అత్యాచారం జరుగుతుంటే తల్లుల పెంపకంపై మంత్రి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు.సజ్జల రాసిన స్టేట్‌మెంట్లను హోంమంత్రి చదువుతున్నారని ఆరోపించారు. జంగారెడ్డిగూడెం సారా మరణాలు సహజ మరణాలంటూ సీఎం కొట్టిపారేయడం దారుణమన్నారు. పదో తరగతి పరీక్షలను నిర్వహించలేని సీఎం మూడు రాజధానుల కడతాడట అని వ్యాఖ్యనించారు.