విజయవాడ, మే 7,
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వ వైఫల్యాల ఖాతాలోకి తాజాగా టెన్త్ పరీక్షల నిర్వహణ కూడా చేరింది. ప్రభుత్వాన్ని నడపడంలో అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి నెపం విపక్షం మీదకు నెట్టివేయడానికి జగన్ సర్కార్ చూపుతున్న ఉత్సాహం వైఫల్యాలను అధిగమించి పాలనను గాడిలో పెట్టే విషయంలో మాత్రం చూపించడం లేదు. తనను వ్యతిరేకించిన వారిని, తన నిర్ణయాలను ప్రశ్నించిన వారినీ వేధింపులకు గురి చేయడానికే జగన్ సర్కార్ తనకున్న అధికారాలన్నిటినీ వినియోగిస్తున్నదన్న విమర్శలకు తాజాగా టెన్త్ పేపర్ల లీకు విషయంలో ప్రభుత్వం చెబుతున్న మాటలు, తీసుకుంటున్న చర్యలు బలం చూకూరుస్తున్నాయి. టెన్త్ పేపర్ల లీకు ఉపాధ్యాయుల పనేనని ప్రభుత్వం ఎలాంటి విచారణా జరపకుండానే నిర్ధారణకు వచ్చేసింది. వారి చేత లీకులు చేయిస్తున్నదెవరో కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ధారణలూ అవసరం లేకుండానే ప్రకటించేసింది. పేపర్ల లీకు పూర్తిగా టీచర్ల పనేనంటూ ఇప్పటి వరకూ దాదాపు 60 మంది టీచర్లపై చర్యలు తీసుకుంది. వాట్సాప్ గ్రూపుల ద్వారా లీకులకు పాల్పడుతున్నది టీచర్లేనని, వారి వెనుక ఉన్నది చైతన్య, నారాయణ విద్యా సంస్థలేనని ప్రభుత్వం చెబుతోంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం అసలు టెన్త్ పేపర్లే లీక్ అవ్వలేదని ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. ఒక వైపు సంబంధిత శాఖ మంత్రి పేపర్ల లీక్ అవాస్తవమని చెబుతుంటే.. సర్కార్ మాత్రం పేపర్ల లీక్ కు బాధ్యులంటూ టీచర్లపై వేటు వేస్తోంది. కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. ఈ గందరగోళం ప్రభుత్వంలో ఉందా? లేదా తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశ పూర్వకంగానే గందరగోళం సృష్టిస్తోందా అన్న సందేహాలు ప్రజలలో వ్యక్తమౌతున్నాయి.అయితే ప్రభుత్వం తమపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందనీ, ఉద్దేశ పూర్వకంగానే లీకు వీరులుగా తమపై ముద్ర వేసి చర్యలు తీసుకుని ప్రజలలో పలుచన చేయడానికి ప్రయత్నిస్తున్నదని టీచర్లు ఆరోపిస్తున్నారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్నందునే ప్రభుత్వం టీచర్లను వేధించేందుకే పేపర్ల లీకును వాడుకుంటోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. లీకు వీరులంటూ ప్రభుత్వం అరెస్టు చేసిన టీచర్లంతా కూడా ఆందోళనల్లో చురుకుగా వ్యవహరిస్తున్న వారే కావడం ఇక్కడ ప్రత్యేకించి గమనార్హం.ఆ విషయం పక్కన పెడితే.. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకూ తావు లేకుండా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతా నిర్వహణలో పూర్తిగా విఫలమైన సర్కార్..లీకుల వెనుక కుట్ర అంటూ ఆరోపణలు చేయడం ఆడ లేక మద్దెలు ఓడు అనడం తప్ప మరొకటి కాదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ తో ముడి పడి ఉన్న పరీక్షల నిర్వహణలో జగన్ సర్కార్ వైఫల్యం సహించరానిదని అంటున్నారు. విద్యా శాఖ మంత్రిగా బాధ్యత తీసుకోలసిన బొత్స సత్యనారాయణ బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదని అంటున్నారు. అన్నట్లుగా జగన్ రాష్ట్రంలో జరిగే సమస్త తప్పులకూ విపక్షమే కారణమని చెప్పడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అవకతకలకు జగరకుండా, తప్పులు జరగకుండా, ఒక వేళ అలా జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుని వాటిని సరిదిద్దాల్సిన అధికారంలో ఉన్న జగన్ నెపం విపక్షం మీద తోసేసీ తానేం చేయలేనని చేతులెత్తేయడం వింతగా ఉందని వైసీపీ వర్గాలే అంటున్నాయి. నేరం చేసిన వారు ఎవరు అన్న దాని కంటే వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్నదే ముఖ్యం కాగా, జగన్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. విపక్షం మీద ఆరోపణలు చేయడం తప్ప.. ఆ ఆరోపణలపై నిలబడటం కానీ, చర్యలు తీసుకోవడం కానీ ఇప్పటి వరకూ జరిగిన దాఖలాలు కనబడవు. అధికారంలో ఉండి చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా ఎంత సేపూ ఎదుటి వారిపై నిందలు మోపి పబ్బం గడిచిపోయిందనుకునే రీతిలో జగన్ తీరు ఉంది. అనుభవ రాహిత్యం, అవగాహనా రాహిత్యానికి పరాకాష్టగా, అధికార ఉన్నాదానికి కేరాఫ్ అడ్రస్ గా జగన్ పాలన ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.