విజయవాడ, మే 7,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా అన్నవరం లో టిడిపి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పొత్తుల విషయంలో చేసిన పరోక్ష వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు వ్యాఖ్యలు: చంద్రబాబు అన్నవరంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తుని, పత్తిపాడు నియోజకవర్గాల కార్యకర్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రజా ఉద్యమం రావాల్సి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం తాము తీవ్రవాదుల లాంటి వారితో పోరాడుతున్నామని పరోక్షంగా జగన్ పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా ఏర్పడే ప్రజా ఉద్యమానికి టిడిపి నాయకత్వం వహిస్తుందని, అవసరమైతే త్యాగాలకు కూడా టిడిపి సిద్ధంగా ఉందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై విశ్లేషణ: చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీతో పొత్తు ను ఉద్దేశించి అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆమధ్య పవన్ కళ్యాణ్ కూడా పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలి పోనివ్వం అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పై వేర్వేరు కారణాల వల్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తోంది. విపరీతంగా పెరిగిన ధరలు, వాలంటీర్ ఉద్యోగాలు తప్ప మరి ఏ రకమైన ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం, ప్రతియేటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన హామీలను నెరవేర్చ లేకపోవడం, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ స్థాయి పెరగడం, పిఆర్సి విషయంలో ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం వంటి అనేక కారణాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ, విపక్షాలు వేరువేరుగా పోటీ చేయడం ద్వారా జగన్ కు కొద్దిపాటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కలిగే అవకాశం ఉండే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అందు వల్ల విపక్షాలు ఏకమై పోటీచేస్తే జగన్ ప్రభుత్వం గెలిచే అవకాశాలు దాదాపు శూన్యం అనే అభిప్రాయం కూడా ప్రజల్లో విస్తృతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుండే చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు అన్న విశ్లేషణలు చంద్రబాబు వ్యాఖ్యలపై వినిపిస్తున్నాయి . అయితే త్యాగాలకు సిద్ధం అన్న చంద్రబాబు మాటల్లోని మర్మం మాత్రం వారు పసికట్ట లేకపోతున్నారు. పొత్తుల లో భాగంగా ఎమ్మెల్యే సీట్లు ఎక్కువభాగం ఇతర పార్టీలకు ఇవ్వడానికి సిద్ధం అన్న ఉద్దేశంతో త్యాగం గురించి మాట్లాడారా, ఒకవేళ అధికారంలోకి వస్తే మంత్రి పదవుల లో సింహభాగం ఇచ్చే విషయం గురించి ఆ విధంగా ప్రస్తావించారా, లేక సీఎం సీట్ ను సైతం ఇతర పార్టీలకు త్యాగం చేసే ఉద్దేశం నిజంగా చంద్రబాబుకు ఉందా అని వారు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన వైకాపా నేత మల్లాది విష్ణు, తమ ప్రభుత్వం ఎంత బలంగా ఉందన్న దానికి చంద్రబాబు వ్యాఖ్యలే నిదర్శనం అని, ఒంటరిగా జగన్ ని ఢీకొనే సామర్థ్యం తమకు లేకపోవడం వల్లే ప్రతిపక్షాలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యల్లో సైతం చంద్రబాబు జనసేన వంటి పార్టీలు కలిసి ఎన్నికల కి వెళ్ళకూడదు అనే భావం ధ్వనించింది.అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో జనసైనికుల నుండి మాత్రం ఊహించనంత సానుకూల స్పందన లేదు. 2014 ఎన్నికలలో ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా పవన్ కళ్యాణ్ టిడిపి పార్టీకి మద్దతు ఇస్తే, ఎన్నికలు అయిన తర్వాత టిడిపి ఏరు దాటాక తెప్ప తగిలేసిన విధంగా వ్యవహరించిందనే భావన వారిలో ఉంది. ప్రభుత్వం లోకి తాము వచ్చిన తర్వాత చింతమనేని, అశోకగజపతి రాజు టిడిపి నేతలు తన సొంత అన్నని గెలిపించుకోలేని పవన్ కళ్యాణ్ తమ పార్టీని గెలిపించాడా అంటూ వెటకారంగా మాట్లాడిన విషయాలను, అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియని తెలియదు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేసిన విషయాలను గుర్తు చేస్తూ, టిడిపి తో పొత్తు ద్వారా తమ పార్టీ మరొకసారి మోసపోయే అవకాశం ఉందన్న భావనను వారు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక భాగం జనాభా కలిగిన సామాజిక వర్గానికి ఇప్పటిదాకా ఇన్ని దశాబ్దాలైనా ముఖ్యమంత్రి పదవి రాలేదని, పవన్ కళ్యాణ్ ని సీఎం గా ఒప్పుకుంటే తప్ప టిడిపితో పొత్తు తమకు అవసరం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే టిడిపి అభిమానులు మాత్రం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొకసారి వెనకబడి పోయిందని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి సహాయం చేయాలని, జగన్ నుండి ప్రజలను విముక్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఆ విధంగా సహాయం చేయాలని, అంతేకాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం లో చేరడం ద్వారా పవన్ కళ్యాణ్ కూడా పాలనానుభవం సంపాదించుకోవచ్చు అని, తర్వాత భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మరెప్పుడైనా సీఎం పదవి కోసం పోటీ పడవచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జనసైనికులు మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. జనసేన పార్టీకి కచ్చితంగా రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉందని, ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే కనుమరుగు అయేది టిడిపి పార్టీ యే తప్ప తమ పార్టీ కాదని, డబ్బులు లేకపోయినా పార్టీ నడిపే సామర్థ్యం పవన్ కళ్యాణ్ కి ఉందని, కానీ మరొక పర్యాయం జగన్ అధికారంలోకి వస్తే ఇప్పటికే సగం చిక్కిపోయిన టిడిపి పార్టీని పూర్తిస్థాయిలో ధ్వంసం చేస్తాడని, పార్టీ అవసరాలను గుర్తించి టి డి పి యే త్యాగాలు చేయాలని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా, చంద్రబాబు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు ఏ భవిష్యత్తు సమీకరణలకు దారి తీస్తాయో వేచి చూడాలి.