YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎడారిగా శ్రీ శైలం మారనుందా..

ఎడారిగా శ్రీ శైలం మారనుందా..

కర్నూలు, మే 7,
నీటి కేటాయింపులు లేకుండా.. 29.9 టీఎంసీల తుంగభద్ర జలాలను వాడుకోవడానికి కర్ణాటక సర్కార్‌ చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇవ్వడంలో, జాతీయ హోదా కల్పించడంలో కేంద్ర జల్‌ శక్తి శాఖ వ్యవహరించిన తీరును దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో లేవనెత్తాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. అప్పర్‌ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌ ఆయకట్టుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్‌లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని వివరించనున్నాయి.  తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని బచావత్‌ ట్రిబ్యునల్‌ స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునలే తేల్చింది. కానీ.. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీలు మిగిలాయని, 65 శాతం లభ్యత ఆధారంగా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ (తీర్పు ఇంకా అమల్లోకి రాలేదు) కేటాయించిన పది టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించిన గోదావరి జలాలకుగానూ దక్కిన 21 టీఎంసీల్లో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 బేసిన్‌లలో మిగిలిన 6 టీఎంసీలు వెరసి.. 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోనూ) తరలించేలా అప్పర్‌ భద్ర చేపట్టామని కర్ణాటక ప్రతిపాదించింది.అప్పర్‌ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇవ్వాలంటే.. బేసిన్‌ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోవాలి. కానీ.. ఈ రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే 2020, డిసెంబర్‌ 24న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక అనుమతి ఇచ్చేసింది. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికకీరణ వల్ల నీళ్లు మిగల్లేదని.. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమల్లోకి రాలేదని.. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు ఎలా అనుమతి ఇస్తారని ఏపీ, తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. అప్పర్‌ భద్రను 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021, మార్చి 25న కేంద్ర జల్‌ శక్తి శాఖ అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనపై ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ నేతృత్వంలోని హైపవర్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.12,500 కోట్లను అందించడానికి కేంద్రం సమ్మతించింది.అప్పర్‌ భద్ర పూర్తయితే.. తుంగభద్ర డ్యామ్‌కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంతో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. ఇది తుంగభద్ర డ్యామ్‌పై ఆధారపడిన ఏపీలోని ఆయకట్టుతోపాటు కృష్ణా బేసిన్‌లో తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి.

Related Posts