చెన్నై, మే 7,
సీఎం స్టాలిన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. గత ఏడాది మే 7న డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. మెరీనా బీచ్‌లో ఉన్న తన తండ్రి కరుణానిధి స్మారక చిహ్నం అన్నా మెమోరియల్‌కు బస్సులో వెళ్తూ ప్రయాణికులు, కండక్టర్‌తో ముచ్చటించారు. డీఎంకే పాలన ఎలా ఉందని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్టాలిన్ స్వయంగా బస్సు ఎక్కడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎం స్టాలిన్ మెరీనా బీచ్ వద్ద కరుణానిధి స్మారకం వద్ద నివాళులర్పించారు. మరోవైపు అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ఐదు కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులందరికీ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రకటించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్, విద్యార్థులకు వైద్య పరీక్షలు, పట్టణ కేంద్రాల్లో పీహెచ్‌సీల ఏర్పాటుపై కూడా సీఎం స్టాలిన్ ప్రకటన చేశారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో సీఎం అనే పథకాన్ని కూడా ప్రకటించారు.