విజయవాడ, మే 9
పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలకు సీఎం జగన్ స్మార్ట్‌గా చెక్ పెడుతున్నారు. అసంతృప్త నేతలకు బుజ్జగిస్తూ.. ఒకరంటే ఒకరు గిట్టని నేతలకు సర్దిజేబుతూ పార్టీ అధినేతగా సక్సెస్ అవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఏపీ కేబినెట్ విస్తరణ తరువాత అధికార వైఎస్సార్సీపీలో ఒక్కసారిగా అంతర్గత పంచాయితీలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా మంత్రి పదవి దక్కని కొందరు కీలక నేతలు బహిరంగంగానే అధిష్టానంపై తమ అసంతృప్తి బయటపెట్టారు. పార్టీ కోసం ఎంతో కష్టపడినా.. చివరికి తమకు నిరాశే మిగిలిందని తమ ఆవేదనను కార్యకర్తల వద్ద చెప్పుకున్నారు. ఇలాంటి నాయకులకు బుజ్జగిస్తునే.. ఇతర ప్రాంతాల్లో ఒకరంటే ఒకరు గిట్టని నేతలను తన వద్దకు పిలిపించుకుని సర్దిచెబుతూ సీఎం జగన్ పార్టీ అధినేతగా సక్సెస్ అవుతున్నారు.ముఖ్యంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి-అనిల్ కుమార్ యాదవ్ ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోటాపోటీగా ర్యాలీలు, సభలు నిర్వహించడం వైఎస్సార్సీపీ కార్యకర్తలను అయోమయానికి గురిచేసింది. ఫ్లెక్సీల విషయంలో ఇద్దరి నేతల మధ్య రాజకీయం ముదిరి పాకనపడింది. దీంతో విషయంపై జగన్ వెంటనే ఇద్దరి నేతలను తన వద్దకు పిలిపించుకున్నారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి.. పార్టీ కోసం పనిచేయాలని ఇద్దరు నేతలకు సర్దిచెప్పారు. దీంతో కాకాణి-అనిల్ కుమార్ యాదవ్ మెత్తబడ్డారు. ఆ తర్వాత తమ మధ్య వివాదాలకు చెక్ పెడుతూ.. ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. కలిసికట్టుగా పనిచేసి.. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గెలిపించుకుంటామని వారు చెప్పారు. దీంతో జిల్లాలో వైఎస్సార్సీపీలో విభేదాలన్నీ తొలిగినట్లేనని నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.
మార్గాని ఇంటికి జక్కంపూడి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలకు జగన్ చెక్ పెట్టారు. గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ భరత్ రామ్‌లు పాత గొడవలను పక్కనే పెట్టేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనలతో అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి రాయభారంతో ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు. ఎంపీ భరత్ రామ్ ఇంటికి వెళ్లిన జక్కంపూడి రాజా.. గతంలో చిన్న, చిన్న విభేదాలు ఉన్నా.. ఇక నుంచి కలసి పనిచేస్తామని చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకుని.. కలిసి పనిచేస్తామన్నారు. ఇటీవలె తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాజా.. ఎంపీ భరత్ రామ్‌తో కలిసిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
నగరి రాజకీయాలు సైతం..
నగరి ఎమ్మెల్యేగా ఎన్నికై ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాకు తన నియోజకవర్గంలోనే సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సీఎం జగన్ బర్త్ వేడుకలను ఎవరికి వారే వేర్వేరుగా నిర్వహించారు. తమ పార్టీలోనే కోవర్టులు, పార్టీ ద్రోహులు ఉన్నారని అప్పట్లో రోజా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. అదేవిధంగా నిండ్ర ఎంపీపీ ఎన్నికల సమయంలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. అయితే రోజా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇక్కడ అన్నీ సర్దుకున్నాయి. మంత్రి పెద్దిరెడ్డితో రోజా వరుస సమావేశాలతో చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ రాజకీయాలు కూల్‌గా సాగుతున్నాయి.అటు మంత్రి పదవి కోల్పోయిన నేతలను.. ఇటు అంతర్గత గొడవలతో ఎడమొహం పెడమొహంగా నాయకులకు సీఎం జగన్ సర్దిచెప్పడంతో సక్సెస్ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు. ఇన్నాళ్లుగా ఉన్న తమ మధ్య ఉన్న వైర్యాన్ని పక్కన పెట్టి.. అందరూ నేతలు పార్టీ కోసం పనిచేస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు. సమస్య ఏదైనా వస్తే.. పరిష్కరించేందుకు అండగా అధినేత జగన్ ఉన్నారనే ధైర్యం భరోసా అందరిలోనూ నెలకొంది. అంతర్గత విభేధాలను సీఎం జగన్ ఎంతో స్మార్ట్ చెక్ పెడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు