విశాఖపట్టణం, మే 9,
అయ్యయో మంత్రి పదవీ పోయెనే.. ఉన్నది కాస్తా ఊడింది.. పరువంతా గంగలొ కలిసిందీ.. టికెట్ వస్తుందో రాదో తెలియదే’ అని పాడుకోవాల్సిన స్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాసరావు పరిస్థితి. గురువుకు నామం పెట్టాడు.. వైసీపీ జెండా పట్టాడు.. అమాత్యుడయ్యాడు.. అయినా తన నియోజకవర్గానికి చేసిందేమీ లేక చేతులెత్తేశాడనే విమర్శలు ఆయనపై వస్తున్నాయి. భీమిలి నియోజకవర్గంలో అవంతిని గెలిపించిన జనమే ఇప్పుడు ఆయన అంటే కారాలు మిరియాలు నూరుతున్నారంటున్నారు. అవంతి శ్రీనివాసరావుపై విశాఖ జిల్లాలో ప్రత్యేకించి భీమిలిలో చెప్పలేనంత వ్యతిరేకత వస్తోందట. దాంతో ఏపీ సీఎంగా అవంతి మంత్రి పదవిని ఊడబెరికేశారు. వైసీపీ అధినేతగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండబోదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తనకు ఇక వైసీపీలో నూకలు చెల్లిపోయినట్లు సమాచారం వస్తున్న నేపథ్యంలో తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావు ద్వారా మళ్లీ టీడీపీలో చేరేందుకు యత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి.మూడేళ్లు ఏపీ కేబినెట్లో ఉన్నప్పటికీ విశాఖ జిల్లాకు గానీ, సొంత నియోజకవర్గం భీమిలికి గానీ అవంతి చేసిందేమీ లేదనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి పదవిలో ఉన్నప్పుడు అవంతి రూటే సెపరేటు అన్నట్లు వ్యవహరించేవారంటారు. మహిళలను ఉద్దేశించి మాట్లాడినా.. విపక్ష నేతలపై విరుచుకుపడినా అవంతి స్థాయి, స్థానం వేరు అంటారు. గురువు గంటా శ్రీనివాసరావుకు నామం పెట్టి వైసీపీలో చేరారు. అమాత్య పదవిని అనుభవించారు.విశాఖ జిల్లాలో అప్పుడు ఏకైక మంత్రిగా తన హవా కొనసాగించాలని అవంతి ప్రయత్నించారు. మంత్రిగా శాఖాపరమైన వ్యవహారాల కన్నా రాజకీయంగా దూకుడుగా ఉండేందుకే అవంతి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ నేతలపై విరుచుకుపడడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించడం, టీడీపీ అధినేత చంద్రబాబుకు కౌంటర్లు వేశారు. అక్కడితో ఆగకుండా మిత్రుడు, రాజకీయంగా ప్రత్యర్థి అయిన గంటా శ్రీనివాసరావుపై వ్యక్తిగత విమర్శలకు అవంతి దిగడం జిల్లా ప్రజలకు అంతగా రుచించలేదంటారు. మామూలుగానే గంటా శ్రీనివాసరావుకు జిల్లాలో మంచి పట్టు ఉందంటారు. అలాంటి గంటాపై అవంతి విమర్శలు చేయడం జిల్లా ప్రజలకు నచ్చలేదంటారు. అవంతికి విశాఖ జిల్లాలో విజయసాయిరెడ్డి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారు. దాంతో కేవలం భీమిలికే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది.మంత్రిగా ఉన్నప్పుడు అవంతిపైన భూ ఆక్రమణల విమర్శలు వెల్లువెత్తాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అవంతిపై ఇవే ఆరోపణలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. దాంతో పవన్ కళ్యాణ్ ను అవంతి ఛాలెంజ్ చేయడమే కాకుండా సమాధానం చెప్పుకునేదాకా వెళ్లింది. పవన్ ప్యాకేజీ స్టార్ అనే దాకా బరితెగించడంతో జనసైనికుల నుంచి, పవన్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారాయన. అవంతి ఇలాఖా భీమిలి పరిధిలోనే భూ వివాదాలు ఎక్కువగా రావడం కూడా ఆయన ప్రతిష్ట మసకబారేలా చేశాయంటారు. ఇలా ఎన్నెన్నో ఆరోపణల నేపథ్యంలో అవంతికి ఈ సారి జగన్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనే చర్చ వైసీపీ రాజకీయ వర్గాల్లోనే జరుగుతుండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పవన్ పార్టీలోకి వెళ్దామంటే అవంతికి దారి కనిపించడం లేదట. వైసీపీ తిరస్కరిస్తే.. టీడీపీలోకి అయినా వెళ్లాలని అవంతి ఇప్పుడు స్వాభిమానం పక్కన పెట్టి గంటా శ్రీనివాసరావు ద్వారా రాయబారం నడపాలని యోచిస్తున్నారట.విశాఖ ఉక్కు ఉద్యమంలో అవంతి సరిగా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. భూ ఆక్రమణల ఆరోపణలు అవంతిని అల్లరిపెడుతున్నాయి. ‘పిచ్చివేషాలు వేయకుండా ఇంటికి రా, నా మాట విను, అన్ని రకాలుగా బాగానే ఉంటది. అరగంటలో పంపించేస్తా.. చెప్పిన మాట విను. నా కోసం అరగంట సమయం కూడా కేటాయించలేవా? ఏం చేస్తున్నావ్? రాకపోతే నీ ఇష్టం.. వస్తే మంచి భవిష్యత్తు బాగుంటుంది’ అని ఓ మహిళతో మంత్రి అవంతి మాట్లాడినట్లు ఉన్న ఆడియో టేపు ఆయనకు ఏమైనా పరువు మిగిలి ఉందంటే దాన్ని భీమునిపట్నం బీచ్ లో కలిపేసిందంటారు. విశాఖ రైల్వే జోను విషయంలో అవంతి ఎంపీగా ఉన్నప్పుడు ‘జోనూ లేదు.. తొక్కా లేదు’ అని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడాయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొచ్చంటున్నారు. చిరంజీవి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, ఎమ్మెల్యే అయిన అవంతి చిరంజీవితో పాటే కాంగ్రెస్ లో కొనసాగి, ఆనక టీడీపీలో చేరి ఎంపీ అయి, ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవి అందుకుని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయికి వెళ్లారు. అందుకే కాబోలు జనసేన నేత, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ‘పశువులు కూడా ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినవు’ అని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయంటారు. మొత్తానికి అవంతి వేస్తున్న కుప్పిగంతులు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఎటు తీసుకెళతాయో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.