గుంటూరు, మే 9
వాళ్లిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. అంతేనా ఆ పార్టీలో ఇరువురూ కీలకమైన వారే.. ఇరువురూ పార్టీ అధినేతకు సన్నిహితులే.. పార్టీలో పవర్ సెంటర్లే. అయితేనేం ఇద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలు. ఇరువురి మధ్యా సత్సంబంధాలు ఉన్నాయా అంటే.. ఎవరూ ఉన్నాయన్న సమాధానం ఇవ్వరు. అలా అని ఇరువురి మధ్యా విబేధాలు ఇప్పటి వరకూ బహిర్గతమైందీ లేదు. ఇద్దరూ పాలిష్ట్ పొలిటీషియన్లే.. తమ అయిష్టతను బయటపడనీయరు. అలాగని ఇరువురూ కలుసుకుని ఆత్మీయంగా మాట్లాడుకున్న దాఖలాలు కూడా ఇటీవలి వరకూ లేవు. వైసీపీలో సజ్జల, విజయసాయిలిద్దరూ రెండు పవర్ సెంటర్లని పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఇటీవలి కాలంలో పార్టీలో విజయసాయి ప్రాధాన్యం తగ్గిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. విజయసాయి కంటే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి దాఖలాలు కూడా ఉన్నాయి. పాలనా వ్యవహారాలు, పార్టీ కార్యక్రమాలు, విధాన నిర్ణయాలు, చివరికి మంత్రివర్గ కూర్పు.. ఇలా అన్ని విషయాలలోనూ సజ్జల మాటే చెల్లుబాటైంది. విజయసాయిని పార్టీ ఉత్తరాధ్ర వ్యవహారాల ఇన్ చార్జి బాధ్యతల నుంచి తప్పించి ఆ బాధ్యతలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించడంతో పార్టీలో విజయ సాయి ప్రాధాన్యత గణనీయంగా తగ్గిందని రూఢీ అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే విజయసాయి సజ్జల నివాసానికి వెళ్లి ఆయనతో బేటీ అయ్యారు. పార్టీ వర్గాలలోనే కాదు, రాజకీయ సర్కిళ్లలో కూడా ఈ భేటీ ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. అందరిలో ఆసక్తి రేకెత్తేలా చేసింది. ఇంతకీ వీరిరువురి మధ్యా భేటీలో ఏ విషయంపై చర్చించుకున్నారన్నది అధికారికంగా వెల్లడి కాకపోయినా.. విజయసాయి తాను నిర్వహిస్తున్న జాబ్ మేళాలపై సజ్జలకు వివరణ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ గా ఉన్న సమయంలోనే విజయం సాయి ఆర్బాటంగా జాబ్ మేళాల నిర్వహణ తలపెట్టారు. అయితే పార్టీ కోసం కాకుండా సొంత ప్రాభవాన్ని పెంచుకునేందుకే విజయసాయి జాబ్ మేళాల నిర్వహణ తలపెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్ కు కూడా వీటి నిర్వహణ ఇష్టం లేదన్న వార్తలు వినవచ్చయి.అయితే వీటినేం పట్టించుకోకుండా విజయసాయి విశాఖ, తిరుపతిలలో జాబ్ మేళాలు నిర్వహించేశారు. మూడో జాబ్ మేళా శని, ఆదివారాలలో గుంటూరులో జరగనుంది. దానిపై వివరణ ఇచ్చేందుకే విజయసాయి స్వయంగా సజ్జల ఇంటికి వెళ్లారని పార్టీ వర్గాల సమాచారం. అయితే విజయ సాయి స్వయంగా సజ్జల ఇటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే పార్టీలో సజ్జల ఆధిపత్యాన్ని ఆయన అయిష్టంగానైనా సరే అంగీకరించినట్లేనని అంటున్నారు. మొత్తం మీద సజ్జల, విజయ సాయి భేటీ వైసీపీలో ఓ రేంజ్ చర్చకు దారి తీసింది.